పెరుగుతున్న బియ్యం ధరలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:58 AM
నగరంలో బియ్యం ధరలు గత నెల రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి.
26 కిలోల బస్తాకురూ.250-రూ.300 పెంపు
సోనామసూరి జూన్
ప్రారంభంలో రూ.1.250, ఇప్పుడు రూ.1,500
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో బియ్యం ధరలు గత నెల రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. జూన్ ప్రారంభంలో 26 కిలోల బస్తా సోనామసూరి రకం రూ.1,250 ఉండగా, ఇప్పుడు రూ.1,500కు విక్రయిస్తున్నారు. సన్న రకం బియ్యాలు లలిత, అక్షయ, బెల్, డైమండ్, ఆవు-దూడ తదితర రకాలు నెల కిందట రూ.1,350 నుంచి రూ.1,400 ఉండగా, వాటిని ఇప్పుడు రూ.1,600 నుంచి రూ1,700కు అమ్ముతున్నారు. మండపేట రకం బియ్యాలు కిలో రూ.1,250 నుంచి రూ.1,450కి పెరిగాయి. ఈ ధరలు తగ్గే సూచనలు లేవని, ఇంకా పెరుగుతాయని అంటున్నారు.
దిగుబడి తక్కువ
ఉభయ గోదావరి జిల్లాల్లో రైస్ మిల్లర్లు తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకొని మిల్లింగ్ చేసి బియ్యాన్ని విక్రయిస్తారు. అక్కడి నుంచి కూడా అనుకున్న స్థాయిలో సరకు రాకపోవడంతో డిమాండ్‌కు తగిన స్థాయిలో మిల్లులు ఆడడం లేదని చెబుతున్నారు. బియ్యం ఎగుమతికి కేంద్రం అనుమతి ఇవ్వడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యాన్ని అందుకుంటున్న వారు సైతం వాటిని బయట బజారులో అమ్మేసుకొని, సన్నరకం బియ్యాలే కొంటున్నారని, దాంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది సరైన వర్షాలు లేవని, వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నందున, బియ్యం ధరలు ఇప్పట్లో దిగిరావనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మిల్లర్లు, డీలర్లు బియ్యాన్ని నిల్వ చేసి, సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి నుంచే తగిన జాగ్రతలు తీసుకోవలసి ఉంది.
నేడు పీఏసీ కమిటీ రాక
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
శాసనసభా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మంగళవారం రాత్రి నగరానికి రానున్నది. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేతృత్వంలో మొత్తం పది మంది సభ్యుల కమిటీ ఈనెల 22వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం, మధ్యాహ్నం గిరిజన సంక్షేమ శాఖలో నిధుల వ్యయం, పథకాల అమలుపై సమీక్షించనున్నది. ఈనెల 23వ తేదీన పట్టణాభివృద్ధి శాఖలు, సంస్థలపై సమీక్షించి 24వ తేదీన తిరిగి విజయవాడ వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఏడు ఎలక్ర్టిక్ బస్సులు రెడీ
ద్వారకా బస్‌స్టేషన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
నగరానికి చేరిన ఏడు ఎలక్ట్రిక్ బస్సులను భోగాపురం విమానాశ్రయానికి నడిపేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో 13 బస్సులు ఈనెల 25వ నాటికి రానున్నాయని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు. ఇరవై బస్సులను ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వద్ద గల ఎలక్ట్రిక్ బస్ టెర్మినల్‌లో ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇందులో పది బస్సులు గాజువాక నుంచి ఎన్‌ఏడీ మీదుగా, మరో పది బస్సులు సింథియా, రైల్వేస్టేషన్, బీచ్‌రోడ్డు, రుషికొండ ప్రాంతాల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి డ్రైవర్లకు, నిర్వాహణ సిబ్బందికి సంబంధిత నిపుణలతో శిక్షణ ఇస్తున్నారు. స్టీల్ సిటీ డిపో కేంద్రంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఒకటి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం
ఆగస్టు 31వ తేదీకి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబరులో డబ్బులు జమ
2 నుంచి 10, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 22న జమ
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధిం ‘తల్లికి వందనం’ సొమ్ములు ఈనెల 22వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ కానున్నాయి. ఈనెల 24వ తేదీన మెగా పేరెంట్, టీచర్స్ సమావేశం నిర్వహించనున్నందున దాని కంటే ఒకటి, రెండు రోజులు ముందు తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. అయితే ఒకటో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులకు మొదటి విడతలో కాకుండా రెండో విడతలో సొమ్ములు జమ చేయనున్నారు. ప్రస్తుతం ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆగస్టు నెలాఖరు వరకు విద్యా శాఖ అవకాశం ఇచ్చింది. అందువల్ల సెప్టెంబరు ఒకటోతేదీ నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రెండో విడతలో నిధులు విడుదల చేస్తారని అధికారులు చెబుతున్నారు.
కాగా ఈనెల 22వ తేదీన తొలివిడతలో రెండో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.13 వేల వంతున సొమ్ములు జమ చేస్తారు. అయితే బాం్యకు ఖాతాలకు ఆధార్ నంబర్ మ్యాపింగ్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లో తేడాలు, విద్యార్థుల యూడైస్ కోడ్‌లో తప్పులు దొర్లిన వారి వివరాలు జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు కార్యాలయాలకు, విద్యా శాఖకు అందాయి. రెండు శాఖలు కలిపి ఇప్పటివరకూ సుమారు 40 వేల మందికి సంబంధించి పలు తప్పులను సవరించారు. తాజాగా మరో ఎనిమిది వేల మంది తల్లుల వివరాలు జిల్లా అధికారులకు అందాయి. గత ఏడాది అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని ఆదేశించింది. గత ఏడాది జిల్లాలో 1.94 లక్షల మంది విద్యార్థులకు చెందిన 1.32 లక్షల మంది తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ అయ్యాయి. మరో పది వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు సొమ్ములు జమలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వారిలో సగం మందికి ఇప్పటికీ డబ్బులు అందలేదు. ఈ ఏడాది అటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి తల్లి ఖాతాకు సొమ్ములు జమ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.