పెరుగుతున్న పొగమంచు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:31 PM
మన్యంలో పొగమంచు ఏమాత్రం తగ్గడం లేదు. క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ పొగమంచు, చలి ప్రభావం కొనసాగుతున్నది.
ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గని చలి ప్రభావం
అరకులోయలో 11.4 డిగ్రీలు
పాడేరు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు ఏమాత్రం తగ్గడం లేదు. క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ పొగమంచు, చలి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాత్రి వేళల్లో చలికి జనం వణుకుతున్నారు. ఉదయం వేళల్లో తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో వాహనాలు సైతం లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణం శీతాకాలాన్ని తలపించేలా ఉండడం విశేషం. బుధవారం అరకులోయలో 11.4, ముంచంగిపుట్టులో 12.0, పెదబయలులో 13.8, డుంబ్రిగుడలో 14.2, జి.మాడుగులలో 15.8, అనంతగిరిలో 15.9, చింతపల్లిలో 16.0, కొయ్యూరులో 16.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. కొద్ది రోజుల నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత తగ్గడం లేదు. ఉదయం వేళలో దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండల పరిధిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. చలి వలన వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.