Share News

పెరుగుతున్న బీపీ, షుగర్‌ కేసులు

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:08 AM

జిల్లాలో నానాటికీ పెరిగిపోతున్న రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్‌) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

పెరుగుతున్న బీపీ, షుగర్‌ కేసులు

ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్‌ బాఽధితుల సంఖ్య

ఎన్‌సీడీ-4.0 సర్వేలో అనుమానితుల గుర్తింపు

జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఒత్తిడి ప్రధాన కారణాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నానాటికీ పెరిగిపోతున్న రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్‌) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా క్యాన్సర్‌ అనుమానిత కేసులు సైతం పెరుగుతున్నాయని ‘నాన్‌-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) సర్వే-4.0’లో వెల్లడైంది. మానవాళిపై పెను ప్రభావం చూపుతున్న ఈ వ్యాధులపై సర్వేను గత ఏడాది సెప్టెంబరు 17న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రతి ఇంటిలో 18 ఏళ్లు పైబడిన వారికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాల పైబడిన 14,13,585 మంది వుండగా, సోమవారం నాటికి 10,53,490 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు పూర్తి చేశారు. వీరిలో 31,842 మంది రక్తపోటు (బీపీ), 25,149 మంది మధుమేహం (షుగర్‌) అనుమానిత కేసులుగా గుర్తించారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా 3,718 మందికి అధిక బీపీ, 2,670 మందికి మధుమేహం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడితోపాటు శారీరక శ్రమ తగ్గిపోవడం ఇందుకు కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ, మధుమేహం సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి మందులు వాడడం, ఆహార నియమాలను పాటించడం వంటివి చేయకపోతే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పొంచివున్న క్యాన్సర్‌ ముప్పు

జిల్లాలో ఎన్‌సీడీ సర్వేలో ముఖ, రొమ్ము, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌తో పలువురు బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో 12,912 మంది రొమ్ము క్యాన్సర్‌, 18,532 మంది సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానితులను గుర్తించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ముఖద్వార క్యాన్సర్‌ బాధితులు 443 మంది, రొమ్ము క్యాన్సర్‌ బాధితులు 278 మంది, సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితులు 341 మందికి మెరుగైన చికిత్సల కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్‌ చేశారు.

అవగాహన పెంచుతున్నాం

డాక్టర్‌ హైమావతి, డీఎంహెచ్‌ఓ

జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్‌సీడీ సర్వే చేపడుతున్నాం. ఇంటింటి వెళ్లి సర్వే జరపడం ద్వారా వ్యాఽధిగ్రస్థులను గుర్తించి వారికి ప్రత్యేక పరీక్షలు జరిపి, అవగాహన కల్పిస్తున్నాం. అవసరం మేరకు చికిత్సలు అందిస్తున్నాం. నాన్‌-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ సర్వే ద్వారా ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని గుర్తించి తదుపరి పరీక్షలు, చికిత్సలకు పంపుతున్నాం. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలోనే జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా సర్వే పూర్తి చేస్తాం.

Updated Date - Jun 16 , 2026 | 01:08 AM