Share News

భూగర్భ జలాలు పెరుగుదల

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:57 AM

తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న నగర వాసులను తాజాగా కురిసిన భారీవర్షాలు ఆదుకున్నాయి.

భూగర్భ జలాలు పెరుగుదల

  • గత నెలతో పోల్చితే మెరుగు

  • ఆదుకున్న భారీ వర్షాలు

  • సెప్టెంబరులో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 9.88 మీటర్లు

  • ఆగస్టులో 11.51 మీటర్లు...

  • ఎండాడకు కాస్త ఊరట

  • మధురవాడలో మాత్రం అదే పరిస్థితి

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న నగర వాసులను తాజాగా కురిసిన భారీవర్షాలు ఆదుకున్నాయి. అనేకచోట్ల ఎండిన బోర్లలో నీరు చేరింది. నీటి కోసం బాగా ఇబ్బందిపడిన ఆరిలోవ, ఎండాడ, పెద రుషికొండల్లో గత నెలతో పోల్చితే భూగర్భ జలాలు పెరిగాయి. అయితే విచిత్రంగా మధురవాడలో మాత్రం గత నెల కంటే ఇంకా లోతుకు పడిపోయాయి. సెప్టెంబరు నెలలో జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం 9.88 మీటర్లుగా నమోదైంది. అదే గత (ఆగస్టు) నెల చూస్తే 11.51 మీటర్లు. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే (సగటు మట్టం 5.84 మీటర్లు) మాత్రం ఇప్పటికీ భూగర్భ జలాలు ఎక్కువ లోతులోనే ఉన్నాయి.

ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో అసలు వర్షాలు కురవలేదు. దాంతో భూగర్భ జలాలు పడిపోయాయి. రెండు ,మూడు నెలల క్రితమే నగరంలోని అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి. అపార్టుమెంట్‌లలో ఉంటున్నవారంతా ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు కూడా అడుగంటాయి. ఇటువంటి తరుణంలో బంగాళాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈనెల 21వ తేదీ నుంచి వర్షాలు కురిశాయి. తీరం దాటే సమయం (ఈనెల 23వ తేదీ అర్థరాత్రి)లో నగరంలోని అనేక ప్రాంతాల్లో అత్యంత భారీవర్షాలు పడ్డాయి. దాంతో రెండు, మూడు ప్రాంతాల్లో తప్ప దాదాపు అన్నిచోట్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఎండిన బోర్లు రీచార్జి అయ్యాయి. నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ సమయంలో, ఆ తరువాత వచ్చే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

జిల్లాలో భూగర్భ జల మట్టాలను ప్రతి నెలా 24వ తేదీన భూగర్భ జల శాఖ అధికారులు నమోదుచేస్తారు. మొత్తం 31 బోరుబావులు/ఓపెన్‌ బావుల్లో అమర్చిన పీజో మీటర్ల ద్వారా వివరాలు సేకరించి సగటు లెక్కిస్తారు. గత నెలలో సగటు (ఆగస్టు 24 నాటికి) 11.51 మీటర్లు ఉంది. సెప్టెంబరు నెలలో సగటు భూగర్భ జల మట్టం స్వల్పంగా పెరిగి 9.88 మీటర్లుగా నమోదైంది. తాజాగా కురిసిన వర్షాలతో ఆగస్టుతో పోల్చితే సెప్టెంబరులో నీటి మట్టాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతంలో పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల ఆందోళనకరమైన పరిస్థితులు లేవు. నగరంలో ఎండాడ, ఆరిలోవ, పెదరుషికొండ, మారికవలస, సెంట్రల్‌ పార్కు, కణితి కాలనీ తదితర చోట్ల భూగర్భ జలాల పెరుగుదల కనిపించింది. గత నెల ఎండాడలో 30.94 మీటర్లు ఉండగా తాజాగా 25.04 మీటర్లకు చేరింది. అలాగే ఆరిలోవలో 35.12 నుంచి 31.12, పెదరుషికొండలో 23.14 నుంచి 22.18కు, సెంట్రల్‌ పార్కులో 16.04 నుంచి 14.65, అప్పుఘర్‌ వద్ద 12.34 నుంచి 10.06, శివాజీపాలెంలో 16.74 నుంచి 11.23, వెల్లంకిలో 11.35 నుంచి 9.91 మీటర్లకు పెరిగింది. అయితే మధురవాడ ప్రాంతంలో మాత్రం 27.24 నుంచి 28.35 మీటర్లకు, శొంఠ్యాంలో 10.16 నుంచి 11.14 మీటర్లకు పడిపోయాయి. గత నెల 24వ తేదీ తరువాత ఆ రెండు ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయి ఉంటాయని, అందుకే తాజాగా కురిసిన వర్షాలతో కాస్త పెరిగినప్పటికీ...ఇంకా తగ్గుదల కనిపిస్తోందని భూగర్భ జల నిపుణులు వ్యాఖ్యానించారు.

నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాలి

పుష్పలత, డిప్యూటీ డైరెక్టర్‌, భూగర్భ జల శాఖ

తాజాగా కురిసిన భారీ వర్షాలతో నగరంలో భూగర్భ జలాలు పెరిగాయి. అయితే నీటి వినియోగం నుంచి సంరక్షణ వరకు ప్రజల్లో అవగాహన పెరగాలి. వర్షపు నీటిని సంరక్షించుకునేలా నివాసాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేయాలి. వాణిజ్య భవనాలు, కొత్తగా నిర్మించే అపార్టుమెంట్లలో బోర్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.

భూగర్భ జలమట్టాలు మీటర్లలో...

కేంద్రం 2025 2026 2026

సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబరు

ఆరిలోవ 23.35 35.23 31.12

ఎండాడ 13.69 30.94 25.04

మధురవాడ 18.03 27.24 28.58

పెదరుషికొండ 11.32 23.14 22.18

సెంట్రల్‌ పార్కు 11.93 16.04 14.65

శివాజీపాలెం 7.65 16.74 11.23

అప్పుఘర్‌ 5.56 12.34 10.06

శొంఠ్యాం 2.26 10.61 11.14

కణితికాలనీ 12.31 10.16 9.37

వెల్లంకి 5.72 11.35 9.91

Updated Date - Sep 27 , 2026 | 12:57 AM