రిసార్టులో రగడ
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:39 AM
నగర శివారునున్న మరో రిసార్టులో గొడవ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరిట పీకల దాకా తాగిన యువకులు బీరు సీసాలతో వాచ్‌మన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెందుర్తి మండలం ఎస్.ఆర్.పురంలో గల లక్కీ రిసార్ట్స్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈసారి ఎస్.ఆర్.పురంలో...
లేట్ నైట్ బర్త్ డే పార్టీ
15 మంది యువతీ, యువకులు హాజరు
పీకల దాకా తాగి డ్యాన్స్‌లు
ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో
రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాట
ఆ సమయంలో లోనికి వెళ్లిన
వాచ్‌మన్‌పై విచక్షణారహితంగా
బీరు సీసాతో దాడి
పెందుర్తి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
నగర శివారునున్న మరో రిసార్టులో గొడవ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరిట పీకల దాకా తాగిన యువకులు బీరు సీసాలతో వాచ్‌మన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెందుర్తి మండలం ఎస్.ఆర్.పురంలో గల లక్కీ రిసార్ట్స్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని కొబ్బరితోటకు చెందిన యువతి (క్లాత్‌స్టోర్స్‌లో పనిచేస్తున్నది) సోమవారం తన స్నేహితుడు గణకల గణేశ్ అలియాస్ ఘని పుట్టినరోజు కావడంతో ఎస్.ఆర్.పురంలోని లక్కీ రిసార్ట్స్‌లో బర్డ్‌డే పార్టీ ఏర్పాటుచేసింది. వివిధ ప్రాంతాలకు చెందిన 15 మందిని ఆహ్వానించింది. ఇందులో ఎనిమిది మంది యువతులు, ఏడుగురు యువకులు ఉన్నారు. అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు హుషారుగా జరుపుకున్నారు. యువతీ, యువకులు డ్యాన్స్‌తో హోరెత్తించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున పార్టీకి హాజరైన ఇద్దరు యువతుల మధ్య వివాదం జరగడంతో అంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో బిగ్గరగా కేకలు వేస్తూ రిసార్ట్స్‌లో గల ప్లేట్లు, ఇతర సామగ్రిని విసిరేస్తూ బీభత్సం సృష్టించారు. దీంతో కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బీరు సీసాతో వాచ్‌మన్‌పై దాడి
రిసార్ట్స్‌లో గొడవ జరుగుతుందని గ్రహించిన వాచ్‌మన్ బమ్మిడి పైడయ్య (70) తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో లోనికి వెళ్లగా అక్కడి సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. సామగ్రి ధ్వంసంపై యువకులను వాచ్‌మన్ ప్రశ్నించాడు. తాగిన మత్తులో ఉన్న ఓ యువకుడు మంచినీరు తీసుకురమ్మని వాచ్‌మన్‌ను ఆజ్ఞాపించాడు. పైడయ్య అక్కడి నుంచి కదలకపోవడంతో యువకులు కొందరు బీరు సీసా పట్టుకుని వృద్ధుడన్న కనికరం లేకుండా పైడయ్యపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం రిసార్ట్స్ శుభ్రపరిచేందుకు వచ్చిన మహిళలు వాష్‌రూమ్ వద్ద రక్తపుమడుగులో ఉన్న పైడయ్యను చూసి భీతిల్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ కేవీ సతీశ్‌కుమార్ ముందుగా వాచ్‌మన్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయన క్లూస్ టీమ్, ఎఫ్‌సీఎల్ ఫింగర్ ప్రింట్స్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా రిసార్ట్స్‌లోని ఓ గదిలో మద్యంమత్తులో ఉన్న ఓ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు తనకాల గణేశ్ అలియాస్ గనిగా తెలుసుకున్నారు. దాడికి ఎవరు పాల్పడ్డారో విచారణలో తెలుస్తుందన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామన్నారు. ఈ రిసార్ట్స్‌ను నగరానికి చెందిన చక్రి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గండిగుండం సమీపంలోని హ్యాపీ నేచుర్స్ రిసార్ట్స్‌లో కత్తితో దాడి ఘటన జరగడంతో పెందుర్తిలో గల రిసార్ట్స్ నిర్వాహకులతో సోమవారం స్టేషన్‌లో సమావేశం నిర్వహించి భద్రత అంశాలు పాటించాలని సీఐ సూచించారు. ఇందులో లక్కీ రిసార్ట్స్ నిర్వాహకులు కూడా ఉన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన వాచ్‌మన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.