బియ్యం దొంగలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:35 AM
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మిల్లర్లు కొంతమంది చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్నే తిరిగి పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయడం కలకలం రేపుతోంది.
పౌర సరఫరాల గోదాముకు బియ్యం సరఫరాలో భారీ కుంభకోణం
కస్టమ్ మిల్లింగ్ రైస్‌కు బదులు రేషన్ బియ్యం పంపిన మిల్లర్లు
లారీకి రూ.15 వేలు మామూళ్లు
ఇప్పటికే రెండు బృందాలతో తనిఖీలు
విశాఖ, అనకాపల్లి జిల్లాల పౌరసరఫరాల సంస్థ అధికారులకు నోటీసులు
అవుట్‌సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లను బలిపశువులను చేసే ప్రయత్నం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మిల్లర్లు కొంతమంది చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్నే తిరిగి పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పౌర సరఫరాల సంస్థ అధికారులకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
పౌర సరఫరాల సంస్థ సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు ఇస్తుంది. ఆ ధాన్యాన్ని మరపట్టి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు రైస్‌మిల్లర్లు సరఫరా చేయాలి. వాటిని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా పిలుస్తారు. ఇలా శ్రీకాకుళం జిల్లాకు చెందిన 36 మంది మిల్లర్లను విశాఖ జిల్లా పెందుర్తిలోని పౌర సరఫరాల సంస్థ లీజుకు తీసుకున్న గోదాముకు ట్యాగ్ చేశారు. ఈ గోదాము సామర్థ్యం 50 వేల టన్నులు. పెందుర్తి గోదాము నుంచే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కార్డుదారులకు బియ్యం సరఫరా చేస్తుంటారు. అయితే శ్రీకాకుళంలోని రైస్‌మిల్లుల నుంచి మరపట్టిన బియ్యంలో రేషన్ బియ్యం కూడా కలిపి పెందుర్తి గోదాముకు రవాణా చేశారనేది ప్రధాన ఆరోపణ.
శ్రీకాకుళం జిల్లా రైస్‌మిల్లుల నిర్వాహకులు కొందరు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి గోదాముకు తరలించారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే..శ్రీకాకుళం జిల్లాలోని రైస్ మిల్లు నుంచి సీఎంఆర్‌తో లారీ బయలుదేరినట్టు ఇన్వాయిస్ (వేబిల్లు) జనరేట్ చేసేవారు. కానీ బియ్యానికి బదులు నూకలు విశాఖకు రవాణా పంపేవారు. విశాఖలో నూకలు అన్‌లోడ్ చేసిన తరువాత ఇక్కడ కొనుగోలు చేసిన రేషన్ బియ్యం లోడ్ చేసి పెందుర్తి గోదాముకు తరలించేవారు. ఈ మొత్తం వ్యవహారం తెలిసిన రెండు జిల్లాల పౌర సరఫరాల సంస్థలో కొందరు అధికారులు లారీకి రూ.15 వేలు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఈ విధంగా సుమారు 1,000 లారీలు వచ్చినట్టు పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులకు పక్కా సమాచారం అందింది.
బియ్యం రవాణాలో అవకతవకల విషయం తెలియడంతో పౌర సరఫరాల సంస్థ ఎండీగా ఉన్న ఢిల్లీరావు తొలుత ఒక బృందాన్ని పెందుర్తి గోదాముకు తనిఖీల నిమిత్తం పంపారు. ఈ బృందం ఈనెల రెండో వారంలో తనిఖీలు చేసి ఎండీకి నివేదిక అందజేసింది. గోదాములో ఉన్న సీఎంఆర్ బియ్యంలో రేషన్ బియ్యం కలిశాయని పొందుపరిచినట్టు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా రెండు జిల్లాల పౌర సరఫరాల అధికారులు, కిందిస్థాయి సాంకేతిక ఉద్యోగులకు ఎండీ నోటీసులు జారీచేశారని తెలిసింది. నోటీసులకు ఒక అధికారి వివరణ ఇవ్వగా, మరో అధికారి తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. తనకు జిల్లాలో ప్రోటోకాల్ ఖర్చులు ఎక్కువగా ఉన్నందున గోదాముకు వచ్చే బియ్యం రవాణాలో చూసీచూడనట్టు వదిలేశానని వివరణ ఇచ్చారని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా గోదాముకు వచ్చే బియ్యం సీఎంఆర్ బియ్యమా? కాదా అనేది నిర్ధారించాల్సింది టెక్నికల్ అసిస్టెంట్లేనని తప్పించుకునే ప్రయత్నంచేశారని అంటున్నారు. చివరకు అసిస్టెంట్ మేనేజర్లు (టెక్నికల్) కూడా తప్పును గోదాములో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లపైకి నెట్టే ప్రయత్నంచేశారు.
తనిఖీ బృందాలపై ఒత్తిళ్లు
కాగా ప్రధాన కార్యాలయం నుంచి వారం క్రితం వచ్చిన రెండో బృందం తొలుత శ్రీకాకుళం జిల్లాలోని 36 మిల్లుల్లో రికార్డులు తనిఖీ చేసి కీలక ఆధారాలు సేకరించింది. అక్కడ నుంచి పెందుర్తి గోదాముకు వచ్చి తనిఖీలు చేసి రికార్డుల్లో ఉన్న వివరాలతో పోల్చి పలు విషయాలు నమోదుచేసుకుంది. తనిఖీ బృందంలో కింది స్థాయి ఉద్యోగులు కావడంతో వారిపై రెండు జిల్లాల పౌర సరఫరాల సంస్థ అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారనే ప్రచారం సాగుతుంది. గోదాములో కోట్ల రూపాయల కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని పలువురు సూచిస్తున్నారు. కాగా రెండు జిల్లాల పౌర సరఫరాల అధికారుల్లో ఒకరు గతంలో ఒక జిల్లాలో పనిచేసినప్పుడు పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. మళ్లీ పోస్టింగ్ తెచ్చుకున్నారు. మరో అధికారి సుమారు పదేళ్ల నుంచి విశాఖ, విజయనగరం జిల్లాల్లోనే పనిచేస్తున్నారు.