Share News

బియ్యం అమ్మేశారు!

ABN , Publish Date - May 18 , 2026 | 12:39 AM

గత ఏడాది సంభవించిన మొంథా తుఫాన్‌ సందర్భంగా మత్స్యకారులకు అందించాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్‌ డీలర్లు బహిరంగ మార్కెట్లో అమ్మేశారు.

బియ్యం అమ్మేశారు!

మొంథా తుఫాన్‌ సరకు పక్కదారి

మత్స్యకారులకు పంపిణీ చేయని కొందరు డీలర్లు

రేషన్‌ డిపోల్లోని స్టాకు రిజిస్టర్లలో తేడా గుర్తించిన అధికారులు

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

గత ఏడాది సంభవించిన మొంథా తుఫాన్‌ సందర్భంగా మత్స్యకారులకు అందించాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్‌ డీలర్లు బహిరంగ మార్కెట్లో అమ్మేశారు. ఆ శాఖ నిల్వ వివరాలను అడగకపోవడంతో బియ్యం, ఇతర సరకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. ఇటీవల పలు డిపోలను తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖాఽధికారులకు నిల్వ రిజిస్టర్‌లో తేడాలు కనిపించాయి.

మొంథా తుఫాన్‌ ప్రభావంతో మత్స్యకారులకు అందించేందుకు కలెక్టరేట్‌ సమీపంలోని రెల్లివీధి డిపో నంబరు 260కు 7,250 కిలోల బియ్యం (145బస్తాలు) ఇచ్చారు. ఇందులో 2,950 కిలోలు (59 బస్తాలు) పంపిణీచేయగా, 4,300 కిలోల బియ్యం నిల్వ ఉండాలి. కానీ రికార్డుల్లో వివరాలు లేవు. అప్పుఘర్‌ డిపో నంబరు 191లో 2,875 కిలోల బియ్యం, ఇతర సరకులు తక్కువగా ఉన్నాయని, స్టాకు రిజిస్టర్‌లో నమోదుచేయలేదని గుర్తించారు. అంటే బియ్యం నల్లబజారుకు తరలిపోయినట్టేనని అంచనాకు వచ్చారు. మొంథా తుఫాన్‌ సందర్భంగా మత్స్యకారులకు గత ఏడాది నవంబరులో ఉచిత బియ్యం పంపిణీకి డిపోలకు బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సరఫరా చేశారు. వీటిని పూర్తిస్థాయిలో పంపిణీచేయలేదు. కాగా మిగిలిన సరకు గోదాములకు సరెండర్‌ చేయాలి. లేదా డిపోలకు ప్రతినెలా కేటాయించే సరకుల నుంచి మినహాయించి బియ్యం, పంచదార కార్డుదారులకు, కందిపప్పు, నూనె ప్యాకెట్లు అంగన్‌వాడీ డిపోలకు అందజేయాలి. అయితే మిగిలిన సరకుల మాటెలా ఉన్నా బియ్యం మాత్రం పక్కదారి పట్టించరాని తేలింది. పూర్ణామార్కెట్‌ ఏరియాలోని కొన్ని డిపోల్లో ఇప్పటికీ నూనె, పంచదార, కందిపప్పు ప్యాకెట్లు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బియ్యం అమ్మేశారు.


ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌

11 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహణ

సుమారు 4 వేల మంది హాజరు

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని అభ్యర్థుల ఆందోళన

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

దేశంలో ఐఐటీలు/తత్సమాన విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్ష ఆదివారం విశాఖ నగరంలోని 11 కేంద్రాల్లో జరిగింది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12, తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలకు సుమారు నాలుగువేలమంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పరీక్షలో 180 మార్కులకు 48 ప్రశ్నలు, మధ్యాహ్నం 180 మార్కులకు 54 ప్రశ్నలు ఇచ్చారు. కెమిస్ట్రీ ప్రశ్నలు లెంగ్తీగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. న్యూమరికల్‌ బిట్లకు జవాబులు రాయడానికి కూడా ఎక్కువ సమయం పట్టిందని వాపోయారు. ఫిజిక్స్‌లో మరీ కఠినంగా ప్రశ్నలు ఉండడంతో ఎక్కువ మంది చాలా ప్రశ్నలు విడిచిపెట్టారు. గణితం కూడా లెంగ్తీగా ఇచ్చారని అభ్యర్థి ఎన్‌.చరణ్‌ తెలిపాడు. దీనివల్ల మొత్తం ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోలేదన్నారు. కాగా ఉదయం పేపరు కంటే మధ్యాహ్నం పేపరు కఠినంగా ఉందని శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ డైరెక్టర్‌ ఎస్‌.రఘుకుమార్‌ పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఫిజిక్స్‌ కఠినంగా, కెమిస్ట్రీ లెంగ్తీగా ఇచ్చారని వివరించారు.

Updated Date - May 18 , 2026 | 12:39 AM