Share News

బియ్యం ధరలు...భగభగ

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:37 AM

నగరంలో బియ్యం ధరలు భగభగమంటున్నాయి. నెల రోజుల్లో బస్తాకు రూ.200 పెరిగింది.

బియ్యం ధరలు...భగభగ

నెల రోజుల క్రితం 26 కిలోల బస్తా రూ.1,800

ఇప్పుడు రూ.2 వేలు పైనే

హెచ్‌ఎంటీ రకాలు కిలో రూ.85, బీపీటీ సన్నాలు రూ.80

వ్యాపారుల ఇష్టారాజ్యం

చోద్యం చూస్తున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో బియ్యం ధరలు భగభగమంటున్నాయి. నెల రోజుల్లో బస్తాకు రూ.200 పెరిగింది. గత నెల మొదటి వారంలో నాణ్యమైన బియ్యం 26 కిలోల బస్తా రూ.1,800కు విక్రయించగా, ఇప్పుడు అదే బస్తా రూ.2 వేలు చొప్పున అమ్ముతున్నారు. ఈ నెల రోజుల్లో ఉపద్రవం ఏమీ రాలేదు. పంట నష్టం జరగలేదు. దిగుమతులు ఆగిపోలేదు. అయినా మిల్లర్లు రేట్లు పెంచేశారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

బియ్యం ధరలు ప్రతి రోజూ మారిపోతున్నాయి. విశాఖ జిల్లాకు అవసరమైన బియ్యంలో 95 శాతం ఉభయ గోదావరి జిల్లాల నుంచే హోల్‌సేల్‌ వ్యాపారులు తీసుకువస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తిగా వేయలేదు. నీటి సదుపాయం ఉన్నచోటే నాట్లు పడ్డాయి. ఆ పంట నవంబరు నెలాఖరుకు కోతకు వస్తుంది. అప్పటి ధాన్యం రేటును బట్టి బియ్యం ధరలు మారాల్సి ఉండగా, మిల్లర్లు ఇప్పుడే పెంచేశారు. పొరుగునున్న తెలంగాణాలో వరి పంట కోతకు వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు అక్కడికి వెళ్లి ఆ ధాన్యాన్ని అధిక రేట్లు పెట్టి కొంటున్నారు. రాబోయే రోజుల్లో బియ్యానికి డిమాండ్‌ ఉంటుందని, మంచి లాభాలు వస్తాయని మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ ఇస్తున్నారు. వాటిని ఆడించి కొత్త బియ్యం పేరుతో మార్కెట్‌లోకి దించుతున్నారు. వాటి ధర కిలో రూ.70గా అమ్ముతున్నారు. ప్రస్తుతం మిల్లుల్లో ఉన్న పాత బియ్యాన్ని హెచ్‌ఎంటీ రకాలు క్వింటా (వంద కిలోలు) రూ.8,400, బీపీటీ సన్నాలు క్వింటా రూ.8,200కి శనివారం విక్రయించారు. ఇవి టోకు ధరలు. రిటైల్‌గా కిలోకు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల లాభం వేసుకొని అమ్ముతున్నారు. దాంతో విశాఖలో బెల్‌, లలిత, అక్షయ వంటి రకాలు 26 కిలోల బస్తా ధర రూ.2,200కు అమ్ముతున్నారు. బీపీటీ సన్నాలైతే రూ.2 వేలకు ఇస్తున్నారు.

అధికారుల నియంత్రణ కరవు

మార్కెట్‌లో బియ్యం ధరలు రోజూ పెరుగుతున్నా పౌర సరఫరాల శాఖ, ధరల నియంత్రణ కమిటీ చోద్యం చూస్తున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి?, నిల్వలు ఏమాత్రం ఉన్నాయి?...అనే అంశాలపై సమీక్షించడం లేదు. సమావేశాలు నిర్వహించడం లేదు. ఇంకా వీటి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తక్షణమే గోదాములు తనిఖీ చేసి, పాత రేట్లకు బియ్యం విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.


డీఈఈ సహా ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు

ఈఈకి షోకాజ్‌

టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగం

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

వెంకోజీపాలెం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో అవకతవకలకు పాల్పడిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సహా ఐదుగురిపై కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారు. నార్త్‌ జోన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బి.భరణికుమార్‌, ఉత్తర జోన్‌ ఇంజనీరింగ్‌ విభాగం డ్రాయింగ్‌ బ్రాంచిగా పనిచేస్తున్న (జేటీఓ) పోతురాజు, కంప్యూటర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ డి.సత్యరాజ్యలక్ష్మి, అవుట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.దేవి, జూనియర్‌ టెక్నికల్‌ అధికారి బి.జానకిదేవిని విచారణ పూర్తయ్యేంత వరకూ సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో టెండరు డాక్యుమెంట్‌లను మార్ఫింగ్‌ చేసి అధిక మొత్తం బిల్లులు డ్రా చేస్తున్న వైనంపై ‘మహా మాయాజాలం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఒకరు బినామీ పేర్లతో పనులు దక్కించుకుని, బిల్లులు మాత్రం ఎక్కువ (టెండర్‌ వేసినప్పుడు కోడ్‌ చేసిన లెస్‌ల శాతాన్ని మార్ఫింగ్‌ చేయడం ద్వారా) డ్రా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్పందించారు. టెండర్లలో మార్ఫింగ్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక అందించాలని చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజును ఆదేశించారు. ఉత్తర జోన్‌ పరిధిలో కొన్ని పనులకు సంబంధించి టెండర్లలో వ్యత్యాసాలు ఉన్నట్టు, అంకెలు మార్చినట్టు ఆయన ప్రాథమికంగా గుర్తించి కమిషనర్‌కు నివేదించారు. ఈ మేరకు బాధ్యులను సస్పెండ్‌ చేయాలని కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లోగా దీనిపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి శాఖాపరమైన చర్యలను తీసుకుంటామని స్పష్టంచేశారు.

అలాగే సంబంధిత బిల్లుల పరిశీలన, పర్యవేక్షణలో లోపాలపై నార్త్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కె.పద్మావతికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.


స్థానిక ఎన్నికలకు జనసేన కమిటీలు

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముగ్గురేసి సమన్వయకర్తలు నియామకం

ప్రతిచోట 32 మందితో నిర్వాహక దళ్‌

ఐదుగురితో సహాయక బృందం

విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శనివారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ప్రకటించింది. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు, 32 మందితో నిర్వాహక దళ్‌, వారికి మరో ఐదుగురితో సపోర్టింగ్‌ టీమ్‌ అంటూ జాబితాలను ప్రకటించింది.

- విశాఖ తూర్పు నియోజకవర్గానికి పీవీ శివప్రసాద్‌, బి.శ్రీనివాస పట్నాయక్‌, వన్నెంరెడ్డి సతీశ్‌ (జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌)లను సమన్వయకర్తలుగా, మరో 32 మందిని నిర్వాహక దళ్‌గా, ఇంకో ఐదుగురిని సహాయక బృందంగా నియమించింది.

- విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి దుంగ దీవెన రాజు, పీలా రామకృష్ణ, బెహరా భాస్కరరావును సమన్వయకర్తలుగా, 32 మందిని నిర్వాహక దళ్‌గా, ఐదుగురిని సహాయకులుగా నియమించింది.

- విశాఖ ఉత్తర నియోజకవర్గానికి పసుపులేటి ఉషాకిరణ్‌, ఎస్‌.వెంకటేశ్వరరావు, పెద్దిశెట్టి ఉషశ్రీలను సమన్వయకర్తలుగా, 32 మందిని నిర్వాహక దళ్‌గా, ఐదుగురిని సహాయకులుగా నియమించింది.

- విశాఖ దక్షిణ నియోజకవర్గానికి కందుల నాగరాజు, కేవీ సీతారామరాజు, బీఎస్‌ ఉమామహేశ్వరరావులను సమన్వయకర్తలుగా, 32 మందిని నిర్వాహక దళ్‌గా, ఐదుగురిని సహాయక బృందంగా నియమించింది.

- గాజువాక నియోజకవర్గానికి కోన తాతారావు, గడసాల అప్పారావు, దల్లి గోవిందరాజులును సమన్వయకర్తలుగా నియమించి, నిర్వాహక దళ్‌, సహాయక బృందాలను ఏర్పాటు చేశారు.

- భీమిలి నియోజకవర్గానికి ఎడుమూడి నాగ సూర్యచంద్రరావు, నక్క శ్రీధర్‌, శాఖరి శ్రీనివాస్‌లను సమన్వయకర్తలుగా నిర్వాహక దళ్‌, సహాయక బృందాలను పెట్టారు.

- పెందుర్తి నియోజకవర్గానికి నబ్బిన జనార్దన శ్రీకాంత్‌, గన్న రమాదేవి, బలిరెడ్డి అప్పారావులను సమన్వయకర్తలుగా, నిర్వాహక దళ్‌, సహాయక బృందాలను నియమించారు.


విద్యార్థుల డైట్‌ చార్జీలు పెంపు

జిల్లాలోని 53 సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న సుమారు 6,000 మందికి లబ్ధి

ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు రూ.1,265-1,540

పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు రూ.1,760

మరింత నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం

విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు నెల నుంచి డైట్‌ చార్జీలు (ఆహార ఖర్చులు) పెంచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డైట్‌ చార్జీలు పెంచడం ఇది రెండోసారి.

జిల్లాలో మొత్తం 52 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో బీసీ సంక్షేమ శాఖకు చెందినవి 30, సాంఘిక సంక్షేమ శాఖకు చెందినవి 23 ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖకు చెందిన 12 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో సుమారు 1,200 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరో పద్దెనిమిది పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో 2,200 మంది ఉంటున్నారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 23 హాస్టళ్ల (8 ప్రీ మెట్రిక్‌, 15 పోస్టు మెట్రిక్‌)లో సుమారు 2,400 మంది విద్యార్థులు ఉంటున్నారు.

పెరిగిన రేట్లు ఇలా..

ప్రస్తుతం ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో ఉండే మూడు నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు డైట్‌ చార్జీలు రూ.1,150 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.1,265కు ప్రభుత్వం పెంచింది. అలాగే, ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రస్తుతం రూ.1,400 చెల్లిస్తుండగా, ఈ మొత్తాన్ని రూ.1,540 చేసింది. ఇంటర్‌, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యా కోర్సులు చదువుతూ పోస్టుమెట్రిక్‌ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులకు ప్రస్తుతం రూ.1,600 చెల్లిస్తుండగా, తాజాగా రూ.1,760 చేస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. పెంచిన చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు వడ్డించే ఆహారంలో మార్పులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచడంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:37 AM