రైస్ మిల్లర్ల మాయాజాలం
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:03 AM
చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల ద్వారా సేకరించిన రేషన్ బియ్యాన్నే మిల్లర్లు తిరిగి పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మిల్లుల నుంచి విశాఖ శివారునున్న పెందుర్తిలో గల పౌర సరఫరాల సంస్థ గోదాముకు సరఫరా అయిన బియ్యంలో చాలా వరకు రేషన్ బియ్యం ఉన్నట్టు సమాచారం. పెందుర్తి గోదాముకు 700 లారీల్లో వచ్చిన 20 వేల టన్నుల బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు విచారణ జరిపి నమూనాలు సేకరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పౌర సరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ బదులు
రేషన్ బియ్యం రవాణా?
చిరు వ్యాపారులు, దళారులు,
డీలర్ల ద్వారా సేకరించిన బియ్యం తిరిగి గోదాముకు...
శ్రీకాకుళం జిల్లా నుంచి పెందుర్తి గోడౌన్‌కు
20 వేల టన్నుల బియ్యం రవాణా
అందులో రేషన్ బియ్యం ఉన్నట్టు ఆరోపణలు
లారీలు పెందుర్తి నుంచి వెళ్లకముందే
శ్రీకాకుళంలో వేబిల్లులు జారీ
పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారుల తనిఖీలు...శాంపిల్స్ సేకరణ
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
చిరు వ్యాపారులు, దళారులు, డీలర్ల ద్వారా సేకరించిన రేషన్ బియ్యాన్నే మిల్లర్లు తిరిగి పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మిల్లుల నుంచి విశాఖ శివారునున్న పెందుర్తిలో గల పౌర సరఫరాల సంస్థ గోదాముకు సరఫరా అయిన బియ్యంలో చాలా వరకు రేషన్ బియ్యం ఉన్నట్టు సమాచారం. పెందుర్తి గోదాముకు 700 లారీల్లో వచ్చిన 20 వేల టన్నుల బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు విచారణ జరిపి నమూనాలు సేకరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు ఇస్తుంది. ఆ ధాన్యాన్ని మరపట్టి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు రైస్‌మిల్లర్లు సరఫరా చేస్తారు. వీటిని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా పిలుస్తారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 36 బియ్యం మిల్లులను విశాఖ జిల్లా పెందుర్తిలోని పౌరసరఫరాల సంస్థ లీజుకు తీసుకున్న గోదాముకు ట్యాగ్ చేశారు. ఈ గోదాము సామర్థ్యం 50 వేల టన్నులు. ప్రైవేటు వ్యక్తి గోదాము నిర్మించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అద్దెకు ఇస్తారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కార్డుదారులకు పెందుర్తి గోదాము నుంచే బియ్యం సరఫరా చేస్తుంటారు. అయితే శ్రీకాకుళంలోని రైస్‌మిల్లుల నుంచి 700 లారీల్లో సుమారు 20 వేల టన్నుల బియ్యం పెందుర్తి గోదాముకు రవాణా చేశారు. ఆ మిల్లులు మరపట్టిన బియ్యంతోపాటు రేషన్ బియ్యం కూడా కలిపి పెందుర్తి గోదాముకు తరలించాయనేది ప్రధాన ఆరోపణ.
మిల్లుల నుంచి పెందుర్తి గోదాముకు బియ్యం రవాణా చేయాలంటే ఆన్‌లైన్‌లో ట్రిప్‌షీటు (వే బిల్లు) జనరేట్ చేసి దానిని లారీ డ్రైవర్‌కు అందజేస్తారు. ప్రతిలారీకి జియో ట్యాగ్ చేస్తారు. అంటే శ్రీకాకుళం జిల్లాలో మిల్లు నుంచి బయలుదేరిన లారీ ఏ సమయంలో ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల నుంచి వచ్చే లారీలు పెందుర్తి వరకు మూడు టోల్‌ప్లాజాలు దాటాలి. అదే శ్రీకాకుళం, ఆమదాలవలస ప్రాంతాల నుంచి వచ్చేవైతే రెండు టోల్‌ప్లాజాలు దాటాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన లారీ పెందుర్తి గోదాములో అన్‌లోడింగ్ చేసి బయటకు వచ్చిన వెంటనే మిల్లు యజమానులు ట్రిప్‌షీట్లు జనరేట్ చేసేశారు. నిబంధనల ప్రకారం పెందుర్తి నుంచి బయలుదేరిన లారీ శ్రీకాకుళం జిల్లాలో రైస్‌మిల్లుకు చేరుకుని మళ్లీ బియ్యం లోడింగ్ చేసిన తరువాత ట్రిప్ షీటు జనరేట్ చేయాలి. కానీ మిల్లర్లు అందుకు భిన్నంగా వ్యవహరించి లారీ పెందుర్తి గోదాము నుంచి బయటకు వచ్చిన వెంటనే ట్రిప్‌షీటు జనరేట్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రేషన్ బియ్యం లారీల ద్వారా గోదాముకు తరలించారనే ఆరోపణలున్నాయి. రేషన్ బియాన్ని దళారులు, డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్న కొందరు మిల్లర్లు తిరిగి వాటిని పెందుర్తిలోని పౌర సరఫరాల సంస్థ గోదాముకు తరలించారనేది ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాలో చిరు వ్యాపారుల నుంచి మిల్లులకు చేరిన రేషన్ బియ్యంతోపాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వ్యాపారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యం గోదాముకు చేరాయన్న ఫిర్యాదులు పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరాయి. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు పెందుర్తి గోదాముకు వచ్చి తనిఖీలు చేపట్టారు. కొన్ని బస్తాల నుంచి శ్యాంపిల్స్ సేకరించి లేబొరేటరీకు పరీక్షకు పంపారు. ఈ సందర్భంగా అధికారులు కీలక రికార్డులు, ట్రిప్ షీట్లు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. సుమారు 20 వేల టన్నుల బియ్యంలో రేషన్ బియ్యం ఏ మేరకు ఉన్నాయన్నది తేలాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో రైస్‌మిల్లులను తనిఖీ చేసి విద్యుత్ బిల్లుల్లో తేడాలు గుర్తించారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాల సంస్థ అధికారులు వాస్తవాలు వెలుగులోకి తీసుకువస్తారా? లేదా పెద్దల ఒత్తిడితో మౌనంగా ఉంటారా?...అనేది తేలాల్సి ఉంది.