Share News

విప్లవ జ్యోతి... చైతన్య స్ఫూర్తి!

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:07 PM

స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ వీరుడు అల్లురి సీతారామరాజుకు ప్రత్యేక స్థానముంది. సాయుధ పోరాటంతో బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన అల్లూరి రెండేళ్ల రంప తిరుగుబాటుతో ఆంగ్ల పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. 27 ఏళ్ల వయసులోనే వారి అకృత్యాలు, దురాగతాలను ఎదురించి, నిరక్షరాస్యులైన ఆదివాసీలను స్వాతంత్ర్యోద్యమం దిశ గా నడిపించాడు. అల్లూరి పోరాటంతో బ్రిటిష్‌ ప్రభుత్వంలో వణికిపోయింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

విప్లవ జ్యోతి... చైతన్య స్ఫూర్తి!
మరణం తరువాత బ్రిటిష్‌ పాలకులు తీసిన అల్లూరి చిత్రం

నేడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి

పాండ్రంగిలో అమ్మమ్మ ఇంట జననం

బ్రిటిష్‌ పాలకుల అకృత్యాలపై ఆగ్రహం

ఆదివాసీలతో కలిసి రంప తిరుగుబాటు

కృష్ణాదేవిపేటలో తొలి స్థావరం

లంబసింగిలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

చింతపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి సీతారామరాజు అసలు పేరు శ్రీరామరాజు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో అమ్మమ్మ ఇంట జన్మించాడు. అతని తండ్రి వెంకటరామరాజుది పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు. ఆయన ఫొటోస్టూడియో నడిపేవారు. 1890లో అనకాపల్లివచ్చి కొంతకాలం ఉన్నారు. అదే సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి బతుకుదెరువు కోసం పద్మనాభం మండలం పాండ్రంగి వచ్చి స్థిరపడిన వెంకటరామరాజు (శ్రీరామరాజు తాత) కుమార్తె సూర్యనారాయణమ్మతో వివాహం కుదిరింది. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మల వివాహం 1895లో జరిగింది. మొదటి కాన్పు కోసం సూర్యనారాయణమ్మ పుట్టింటికి వచ్చింది. 1897 జూలై 4న సాయంత్రం సుమారు 4:10 గంటలకు పాండ్రంగిలో శ్రీరామరాజు జన్మించాడు. ఏడాది తరువాత అల్లూరి తల్లిదడ్రులు మోగల్లు వెళ్లిపోయారు. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మలకు 1901లో కూమార్తె సీతమ్మ, 1906లో రెండో కుమారుడు సూర్యనారాయణరాజు జన్మించారు.

కలరాతో తండ్రి మృతి..

సీతారామరాజు తండ్రి రామరాజు రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవారు 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై మరణించారు. ఆ సమయానికి శ్రీరామరాజు ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రిని కోల్పోవడంతో అతని జీవితంలో పెనుమార్పు వచ్చింది. స్థిర ఆదాయం లేక పేదరికంతో రాజు కుటుంబం వివిధ ప్రదేశాలకు వెళ్లి నివసించాల్సి వచ్చింది. తండ్రి మరణం అతని విద్యపై తీవ్ర ప్రభావం చూపింది.

బ్రిటిష్‌ అకృత్యాలపై ఆరా

సీతారామరాజుకు కృష్ణాదేవిపేటకు చెందిన చిటికెల భాస్కరనాయుడు ఆశ్రయం కల్పించాడు. దీంతో అక్కడే స్థావరం ఏర్పరుచుకున్నాడు. 1917లో స్నేహితుడు పేరిచర్ల సూర్యనారాయణతో కలిసి కాషాయవస్త్రాలు ధరించి కృష్ణాదేవిపేట నీలకంఠేశ్వరుని ఆలయంలో మకాం పెట్టాడు. ఆదివాసీలపై బ్రిటిష్‌ పాలకుల దురాగతాలు, అకృత్యాలను తెలుసుకుని రగిలిపోయాడు. పోరాటానికి నిర్ణయించుకున్నాడు.

లేఖపై స్పందన లేక...

లంబసింగి ఘాట్‌ రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్న గిరిజనులకు చెల్లించే కూలీలో చింతపల్లి తహసీల్దార్‌ బాస్టియన్‌ అన్యాయం చేయడంపై సీతారామరాజు బ్రిటిష్‌ పాలకులకు లేఖ రాశాడు. బాస్టియన్‌ క్రూరుడు. నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు రోడ్డు నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై గిరిజనులకు ఆరు అణాలకు బదులుగా రెండు అణాలు మాత్రమే చెల్లించేవాడు. ప్రశ్నించిన ఆదివాసీలను కొరడాలతో కొట్టించేవాడు. దీనిపై సీతారామరాజు ఫిర్యాదు చేసినా బ్రిటిష్‌ పాలకులు పట్టించుకోలేదు. కాగా తనపై ఫిర్యాదుచేశాడనే కోపంతో బాస్టియన్‌ సీతారామరాజు విప్లవ సన్నాహాల్లో ఉన్నాడని ప్రభుత్వానికి లేఖరాశాడు. దీంతో కొన్నాళ్లు అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టి, నర్సీపట్నంలో అధికారుల కనుసన్నల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఉంచింది. ప్రభుత్వ ఉద్యోగి ఫజలుల్లాఖాన్‌ శ్రీరామరాజుఅభిమాని. అతనిని సహాయపడేవాడు. దీంతో తిరుగుబాటు చేయనని సీతారామరాజు మాట ఇచ్చాడు. 1922 జూలై 27న ఫజులుల్లాఖాన్‌ ఆకస్మికంగా మరణించాడు. దీంతో సీతారామరాజు ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. గిరిజన ప్రాంతంలో అడుగుపెట్టి గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండుపడాల్‌, సత్యనారాయణరాజు, అగ్గిరాజు, గోకిరి ఎర్రేసుతో సహ 150 మంది గిరిజనులను బ్రిటిష్‌ పాలకులపై పోరాటానికి సిద్ధం చేశాడు. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసుస్టేషన్‌పై దాడికి నిర్ణయం తీసుకున్నారు.

సాయుధపోరాటానికి నాంది

అల్లూరి సీతారామరాజు అనుచరులతో తొలిసారిగా 1922 ఆగస్టు 22న చింతపల్లిపై దాడిచేశాడు. స్టేషన్‌లో 11తుపాకులు, ఐదు కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 11 బాయనెట్లు స్వాధీనం చేసుకున్నాడు ఆ వివరాలను రికార్డులో నమోదు చేశాడు. 23న కృష్ణాదేవిపేట, 24న రాజవోమ్మంగి పోలీసుస్టేషన్‌లపై దాడిచేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అత్యంత సాహసోపేతంగా అక్టోబరు 15న అడ్డతీగల పోలీసు స్టేషన్‌కు ముందుగా సమాచారం ఇచ్చి మరీ దాడిచేశాడు. అదేనెల 19న రంపచోడవరం పోలీసుస్టేషన్‌ని పట్టపగలే ముట్టడించాడు. అదే ఏడాది డిసెంబరు ఆరు నుంచి రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించిన సీతారామరాజు బ్రిటిష్‌ పాలకులను ముప్పతిప్పలు పెట్టాడు.

రూథర్‌ఫర్డ్‌ నియామకం

సీతారామరాజు పోరాటాన్ని అణచివేసేందుకు 1924 ఏప్రిల్‌ 17 మన్యానికి కలెక్టర్‌గా రూథర్‌ఫర్డ్‌ను నియమించారు. అతడికి విప్లవాలను అణచివేయడంతో నిపుణుడుగా పేరుంది. రూథర్‌ఫర్డ్‌ కృష్ణాదేవిపేటలో సభను ఏర్పాటుచేసి వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియకపోతే ప్రజలను కాల్చివేస్తామని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న సీతారామరాజు మే 7న పశువుల కాపరిద్వారా తానున్న ప్రాంతాన్ని పోలీసులకు చేరవేసి మంప చెరువులో స్నానంచేస్తూ పట్టుబడ్డాడు. ఎలాంటి విచారణ లేకుండానే అల్లూరి సీతారామరాజును కొయ్యూరులోని చింతచెట్టుకు కట్టి గుడాల్‌ కాల్చిచంపాడు. ఆ మరుసటి రోజున రాజు మృతదేహాన్ని ఫొటో తీయించి, కృష్ణాదేవిపేటలో దహనం చేశారు.

భావితరాలకు అల్లూరి చరిత్ర

అల్లూరి సీతారామరాజు చరిత్రను భావితరాలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. లంబసింగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంలో అల్లూరి చరిత్రకు ప్రాధాన్యం ఇచ్చారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న మ్యూజియంలో ఏకైక గిరిజనేతర స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరికి మాత్రమే చోటు కల్పించారు. మ్యూజియంలో 22 అడుగుల ఎత్తైన భారీ అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటూ అతని చరిత్ర, సాయుధపోరాటం, రంప తిరుగుబాటు వివరాలను ప్రదర్శించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Updated Date - Jul 03 , 2026 | 11:07 PM