వలిసెలకు పునరుజ్జీవం
ABN , Publish Date - May 27 , 2026 | 11:57 PM
మన్యం ప్రకృతి అందాలకు వన్నెతెచ్చిన నూనెగింజల పంట వలిసెలకు పునరుజ్జీవం రానుంది. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఏడేళ్లగా వలిసెల పంటలపై వివిధ దశల్లో నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తల ఏడేళ్ల ప్రయోగాలు విజయవంతం
తొలిసారిగా సీటీపీ-1 వంగడం విడుదలకు సిద్ధం
40 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమం
ఈ ఏడాది ముందస్తు రబీలో రైతులకు మినీ కిట్ల పంపిణీ
చింతపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి): మన్యం ప్రకృతి అందాలకు వన్నెతెచ్చిన నూనెగింజల పంట వలిసెలకు పునరుజ్జీవం రానుంది. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఏడేళ్లగా వలిసెల పంటలపై వివిధ దశల్లో నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సీటీపీ(చింతపల్లి)-1 రకం వలిసెల వంగడం విడుదలకు సిద్ధం చేశారు. 40 ఏళ్ల చరిత్రలో పరిశోధన స్థానం వలిసెల పంటలో తొలి వంగడాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ మేలిజాతి వంగడాలను రైతుల పంట పొలాల్లో అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది ముందస్తు రబీలో అభ్యుదయ రైతులకు చిరు సంచుల్లో పంపిణీ చేయనున్నారు.
దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే వలిసెల పంట పండుతోంది. ఈ ప్రాంత వాతావరణం సహకరించడంతో సుమారు యాభైఏళ్లగా ఆదివాసీలు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. వలిసెల నూనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్ వుంది. ఈ నూనెను కాస్మొటిక్స్, ఔషధాలు, వంటకాలలోనూ ఉపయోగిస్తారు. దీంతో ఆదివాసీలు పండించే వలిసెలకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. గిరిజన ప్రాంతంలో 12 ఏళ్ల క్రితం వరకు పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 8,500 హెక్టార్లలో వలిసెల పంటను గిరిజన రైతులు సాగు చేసేవారు. కాలక్రమంగా ఆకాశపందిరి కలుపు, దిగుబడులు తగ్గడం వల్ల సాగు విస్తీర్ణం పడిపోయింది. గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం సాధారణ సాగు విస్తీర్ణం 3,037 హెక్టార్లు కాగా, గత ఏడాది కేవలం 725 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. కేవలం నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక, దిగుబడులు పతనం కావడం వల్ల ఆదివాసీ రైతులు ఈ పంటకు దూరమవుతున్నారు.
ఏడేళ్లగా వలిసెల పంటపై ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పరిశోధనలు
ఆదివాసీ రైతులకు మేలిజాతి వలిసెల వంగడాలను అందించేందుకు 2018లో ప్రభుత్వం ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టు(ఏఐసీఆర్‌పీ) పథకాన్ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా మధ్యప్రదేశ్ జబదల్‌పూర్ నుంచి మేలిజాతి వలిసెల వంగడాలను దిగుమతి చేసుకుని ఏడేళ్లగా విత్తనాల అభివృద్ధిపై వివిధ దశల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. ఐదు రకాల వంగడాలను క్రాసింగ్ చేసి వంగడాలను అభివృద్ధి చేశారు. ఐదు వంగడాలపై వివిధ దశల్లో పరిశోధనలు నిర్వహించారు. 2024లో సీపీఎల్(చింతపల్లి)-1, 2 రకాలు మేలిజాతి వంగడాలుగా ఎంపిక చేశారు. తుది పరిశోధన ఫలితాల ఆధారంగా సీటీపీ-1 రకం వంగడాన్ని ఎంపిక చేశారు. ఈ సీటీపీ-1 వంగడం హెక్టారుకు 3.5 నుంచి 4.5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. తెగుళ్లు, ఆకాశపందిరి కలుపును తట్టుకుంటుంది. పంట కాలం 105-110 రోజులు.
రెండేళ్లలో అధికారికంగా విడుదల
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సీటీపీ-1 వంగడం రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2026-27, 2027-28 వార్షిక సంవత్సరాల్లో రైతుల పంట పొలాల్లో సీటీపీ-1 వలిసెల వంగడాలను సాగు చేయిస్తూ వివిధ దశల్లో అధ్యయనం చేస్తారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులతో సీటీపీ-1 వంగడాలను శాస్త్రవేత్తలు సాగు చేయించి మంచి ఫలితాలు సాధించారు. గిరిజన ప్రాంతంలోనూ ఈ ఏడాది ముందస్తు రబీలో అభ్యుదయ రైతులతో నాట్లు వేయించనున్నారు. రెండేళ్లపాటు రైతుల ద్వారా విత్తనం అభివృద్ధి చేస్తారు. ఈ వంగడాన్ని ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు 2028లో అధికారికంగా విడుదల చేయనున్నారు.