Share News

సోప్‌ యూనిట్‌కు పునరుజ్జీవం

ABN , Publish Date - Jun 22 , 2026 | 10:59 PM

అరకులోయలోని జీసీసీ సోప్‌ యూనిట్‌ (సబ్బుల తయారీ కేంద్రం)కు కూటమి ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవం వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో ఈ యూనిట్‌ మూతపడింది.

సోప్‌ యూనిట్‌కు పునరుజ్జీవం
సోప్‌ యూనిట్‌లో సబ్బులు తయారు చేస్తున్న దృశ్యం

గత వైసీపీ ప్రభుత్వంలో మూసివేత

కూటమి ప్రభుత్వం వచ్చాక పునఃప్రారంభం

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలకు సబ్బుల సరఫరా

గత విద్యా సంవత్సరంలో 14 లక్షల సబ్బుల తయారీ

జీసీసీకి రూ.24.89 కోట్ల వ్యాపారం

అరకులోయ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అరకులోయలోని జీసీసీ సోప్‌ యూనిట్‌ (సబ్బుల తయారీ కేంద్రం)కు కూటమి ప్రభుత్వం వచ్చాక పునరుజ్జీవం వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో ఈ యూనిట్‌ మూతపడింది. అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామనే నెపంతో విద్యార్థులకు కాస్మోటిక్స్‌ను ఇవ్వకపోవడంతో సోప్‌ యూనిట్‌కు పని లేకుండాపోయింది. దీంతో ఇది మూతపడగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పునఃప్రారంభించింది.

కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం పథకాన్ని అమలు చేస్తున్నా పేద విద్యార్థులకు పంపిణీ చేసే కాస్మోటిక్స్‌కు ముడిపెట్టలేదు. రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాలకు సబ్బులు సరఫరా చేయాలని నిర్ణయించింది. యూనిట్‌లోని 25 మంది కార్మికులు ఉత్సాహంగా పని చేయడంతో 2025-26 విద్యాసంవత్సరంలో 14 లక్షల సబ్బులను తయారు చేసి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తిరుపతి నగరాల్లో ఉన్న గోదాములకు సరఫరా చేశారు. అక్కడ నుంచి పరిసర ప్రాంతాల్లోని గిరిజన సంక్షేమ వసతి గృహాలకు సబ్బులు సరఫరా చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో సబ్బుల తయారీ ద్వారా జీసీసీకి సుమారు రూ.24.89 కోట్ల వ్యాపారం జరిగింది. 2026- 27 విద్యా సంవత్సరంలో 20 లక్షల సబ్బులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సోప్‌ యూనిట్‌ మేనేజర్‌ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది వ్యాపారం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ యూనిట్‌ నుంచి కేవలం గిరిజన సంక్షేమ వసతి గృహాలకు సబ్బులు సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. 75 గ్రాముల బరువున్న నీమ్‌, టర్మరిక్‌, జాస్మిన్‌, అల్లోవేరా రకాల సబ్బులను తయారు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Jun 22 , 2026 | 10:59 PM