వందేళ్ల వృక్షాలకు పునరుజ్జీవం
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:48 AM
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా పలు చోట్ల భారీ వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. అయితే వందల ఏళ్లనాటి వృక్షాలను పరిరక్షించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
రోడ్డు విస్తరణతో తొలగిస్తున్న భారీ వృక్షాలు
‘ఆపరేషన్ పునర్‌వనం’ పేరుతో వేరే చోట నాటుతున్న వైనం
పూజలు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
కొండకర్ల ఆవ వద్ద అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్ల పరిశీలన
అచ్యుతాపురం రూరల్, జనవరి 27 : అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా పలు చోట్ల భారీ వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. అయితే వందల ఏళ్లనాటి వృక్షాలను పరిరక్షించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఆపరేషన్ పునర్‌వనం’ పేరుతో ఈ వృక్షాలను వేరేచోట నాటించాలని ఆధికారులను ఆదేశించింది. దీంతో కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, జిల్లా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల మొదటి వారంలో ‘ఆపరేషన్ పునర్‌వనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృక్షశాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో అవసరంలేని మేర చెట్ల కొమ్మలను నరికించారు. చెట్టు మాను చుట్టూ భారీ గోతులు తీశారు. అనంతరం క్రేన్ల సాయంతో వృక్షాలను పెకలించి, భారీ ట్రాలర్లపైకి ఎక్కించి, దిబ్బపాలెం ఎస్‌ఈజ్ పునరావాస కాలనీ, కొండకర్ల ఆవ, అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ ఆవరణలో నాటడానికి తరలిస్తున్నారు. కొండకర్ల ఆవ వద్దకు తరలించి భారీ వృక్షాన్ని.. అప్పటికే సిద్ధం చేసి పెద్ద గొయ్యిలో పాతారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కొబ్బరికాయ కొట్టి పూజచేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు వృక్ష సంపద కంటే సొంత సంపాదనే ధ్యేయంగా పరిపాలన సాగించారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ కోసం తొలగిస్తున్న వందేళ్లపైబడిన భారీ వృక్షాలకు తిరిగి జీవం పోయాలనే ఆలోచన చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్‌లను ఆయన అభినందించారు.
ఉత్సవాలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం
రెండు రోజులపాటు నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవాలు జిల్లా వాసులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పిస్తాయని స్పీకర్ అయ్యన్న అన్నారు. కొండకర్ల ఆవ వద్ద ఉత్సవ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనకాపల్లి, ముత్యాలమ్మపాలెం బీచ్, కొండకర్ల ఆవ వద్ద జరిగే ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని ఆహ్లాదంగా గడపాలని కోరారు. కొండకర్ల ఆవ వద్ద స్థానిక వంటకాలు, మాడుగుల హల్వా, అరకు కాఫీ, ఏటికొప్పాక లక్కబొమ్మలు, తదితర స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్యే విజయ్‌కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, కూటమి నాయకులు దాడి రత్నాకర్, భక్తసాయిరాం, పీలా తులసీరాం, జనపరెడ్డి శ్రీనివాసరావు, పిన్నమరాజు వాసు, ప్రగడ నాగేశ్వరరావు (జూనియర్), బొందల శ్యామ్, పప్పల రమణ, ద్వారపురెడ్డి బాబూజీ తదితరులు పాల్గొన్నారు.