పాఠ్యాంశాల సవరణ ఏయూ నిర్ణయం
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:25 AM
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల సవరణ (అకడమిక్ కరికులం రివిజన్)కు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు నడుంబిగించారు. ఇందుకోసం మూడు వారాల క్రితం కమిటీలను నియమించారు. ఉద్యోగ అవకాశాలు పొందేలా పాఠ్యాంశాల్లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, నైపుణ్య కల్పన వంటి అంశాలను జోడించనున్నారు. వర్సిటీలో ఏడు కాలేజీలు ఉండగా, ఒక్కో కాలేజీకి ఒక్కో కమిటీని ఏర్పాటుచేశారు.
ఏడు కమిటీల నియామకం
అవి ఇచ్చే నివేదికల మేరకు వచ్చే ఏడాది నుంచి
అకాడమిక్ కరికులంలో మార్పులు
ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే లక్ష్యం
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల సవరణ (అకడమిక్ కరికులం రివిజన్)కు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు నడుంబిగించారు. ఇందుకోసం మూడు వారాల క్రితం కమిటీలను నియమించారు. ఉద్యోగ అవకాశాలు పొందేలా పాఠ్యాంశాల్లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, నైపుణ్య కల్పన వంటి అంశాలను జోడించనున్నారు. వర్సిటీలో ఏడు కాలేజీలు ఉండగా, ఒక్కో కాలేజీకి ఒక్కో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీల్లో సెంట్రల్ వర్సిటీలకు చెందిన నిపుణులు నలుగురు ఉండగా, వర్సిటీకి చెందిన ఒక నిపుణుడిని భాగస్వామిని చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్సులు, వాటిలోని పాఠ్యాంశాలను అధ్యయనం చేసి, తగిన మార్పులను కమిటీలు సూచిస్తాయి. ఆగస్టు నెలాఖరు నాటికి నివేదికలను సమర్పించాలని అధికారులు కోరారు. ఈ మేరకు వాటిల్లోని అంశాలను పరిశీలించి మార్పులు, చేర్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన కరికులం అమలు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
రివిజన్‌కు సంబంధించి సూచనలు
ఈ కమిటీలకు వర్సిటీ అధికారులు కొన్ని సూచనలను చేశారు. వర్సిటీలో కోర్సు పూర్తిచేసే విద్యార్థి బయటకు వెళ్లే సమయానికి ఉద్యోగాన్ని సాధించేలా నూతన పాఠ్యాంశాలు ఉండాలి. ఇదే సమయంలో ఏపీ ఉన్నత విద్యా మండలి వర్సిటీలు, అనుబంధ కళాశాలల్లోని డిగ్రీ, పీజీ కోర్సుల కోసం ఉద్దేశించిన అకాడమిక్ నిబంధనలు పరిశీలించాలని, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు క్రెడిట్స్ ఇచ్చేలా, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను కోర్సులో భాగం చేసేలా, కేస్ స్టడీస్‌ను పాఠ్యాంశాల్లో భాగం చేసేలా, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రారంభించేందుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక ఉండాలని కమిటీకి సూత్రపాయంగా అధికారులు సూచించారు.