బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:34 AM
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల అధికారులు బుధవారం సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జెన్కో అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు 110.1095 టీఎంసీలు
ఆంధ్రా వాటాగా 69.8151, ఒడిశా వాటాగా 40.2944 టీఎంసీలు పంపకాలు
సీలేరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల అధికారులు బుధవారం సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జెన్కో అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
2026- 2027 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. అక్టోబరు నెలలో ఒడిశా తన వాటాగా 7.3658 టీఎంసీలు వినియోగించుకుందని, ఆంధ్రా తన వాటాగా 1.7178 టీఎంసీలు వినియోగించుకున్నట్టు తేల్చారు. దీని ప్రకారం అక్టోబరులో ఒడిశా... ఆంధ్రా కంటే 5.6480 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. 2026- 2027 నీటి సంవత్సరంలో జూలై నుంచి అక్టోబరు చివరి నాటికి ఒడిశా 14.8468 టీఎంసీలు వినియోగించుకుందని, ఆంధ్రా తన వాటాగా 8.0126 టీఎంసీలు వినియోగించుకున్నట్టు లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఈ నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు ఒడిశా... ఆంధ్రా కంటే 6.8342 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు తేల్చారు. అలాగే 2025 - 2026 నీటి సంవత్సరంలో ఒడిశా.. ఆంధ్రా కంటే అధికంగా వినియోగించుకున్న 22.6865 టీఎంసీలు కలిపి ఇప్పటి వరకు (అక్టోబరు చివరి నాటికి) ఒడిశా 37.5333 టీఎంసీలు వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో 110.1095 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు కట్టారు. ఇందులో ఆంధ్రా వాటాగా 69.8151 టీఎంసీలు, ఒడిశా వాటాగా 40.2944 టీఎంసీలుగా ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య పంపకాలు జరిగాయి. ప్రస్తుతం ఇరు రాష్ర్టాల ఇరిగేషన్, విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం ఆంధ్రాకు 2,500 క్యూసెక్కులు, ఒడిశాకు 2,300 క్యూసెక్కుల నీటిని బలిమెల నుంచి విడుదల చేయాలని ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకగ్రీవంగా ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఆంధ్రా తరఫున ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్ షేక్ జాకీర్ హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు, డీఈఈ కె.శివశంకరరావు, ఏఈఈ కె.శ్యామల అనుదీప్లు పాల్గొన్నారు. అలాగే ఒడిశా తరఫున పొట్టేరు ఇరిగేషన్ చీఫ్ కనస్ట్రక్షన్ ఇంజనీర్ త్రుపకుమార్ పాత్ర, చిత్రకొండ ఎర్త్ డ్యామ్ డివిజన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కైలాష చంద్ర సేథి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తుషార్ రంజన్ కుంటియా, జూనియర్ ఇంజనీర్ జ్యోతి టోప్నో, ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ మేనేజర్ శాశ్వత్ ప్రియదర్శి, డిప్యూటీ మేనేజర్ బైకుంఠనాధ్ ఓఝూ, అసిస్టెంట్ మేనేజర్లు ప్రశాంత కుమార్ ఐచ్, అమర్సాహూ పాల్గొన్నారు.