బలిమెల జలాశయం నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:31 AM
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై బుధవారం ఆంధ్రా, ఒడిశా అధికారులు సీలేరు ఏపీ జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు.
బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో 86.8499 టీఎంసీల నిల్వలు
ఏపీకి 58.3670, ఒడిశాకు 28.4829 టీఎంసీలుగా పంపకాలు
సీలేరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై బుధవారం ఆంధ్రా, ఒడిశా అధికారులు సీలేరు ఏపీ జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు ఎంతెంత ఉన్నాయో లెక్కలు కట్టారు. 2025- 2026 నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తమ వాటాగా ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించిందో తేల్చారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 65.6500 టీఎంసీలు, జోలాపుట్టులో 20.1999 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి బలిమెల జలాశయానికి 0.6000 టీఎంసీలు, జోలాపుట్టు జలాశయానికి 0.40000 టీఎంసీల నీటి నిల్వలు పరివాహక ప్రాంతాల నుంచి వచ్చి చేరతాయని లెక్కలు కట్టారు. దీని ప్రకారం బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో మొత్తంగా 86.8499 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, ఇందులో ఆంధ్రా వాటాగా 58.3670 టీఎంసీలు, ఒడిశాకు 28.4829 టీఎంసీలుగా ఇరు రాష్ర్టాల మధ్య పంపకాలు జరిగాయి. 2025- 2026 నీటి సంవత్సరంలో జూలై 2025 నుంచి జనవరి 26 వరకు బలిమెల జలాశయం నుంచి ఆంధ్రా తన వాటాగా 28.3996 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు, అలాగే ఒడిశా తన వాటాగా 58.2836 టీఎంసీలు వినియోగించుకున్నట్టు తేల్చారు. దీని ప్రకారం 2025- 2026 నీటి సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి ఆంధ్రా కంటే ఒడిశా 29.8840 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్, రబీ పంటలకు నీటి అవసరాల నేపథ్యంలో ఆంధ్రాకు 6,500 క్యూసెక్కుల నీటిని, ఒడిశాకు 3 వేల క్యూసెక్కుల నీటిని ఈ నెలాఖరు వరకు వినియోగించుకోవడానికి ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రా తరఫున ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్లు షేక్ జాకీర్ హుస్సేన్, సీహెచ్ హనుమ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.జైపాల్, ఏఈఈ సీహెచ్ సురేశ్ పాల్గొనగా, ఒడిశా తరఫున బలిమెల హైడ్రో కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్‌నాయక్, డిప్యూటీ మేనేజర్ కె.బెహరా, అసిస్టెంట్ మేనేజర్ సుబదీప్ పండా, పొట్టేరు ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ కనస్ట్రక్షన్ ఇంజనీర్ కృపాకుమార్ పాత్రో, చిత్రకొండ ఎర్త్ డ్యాం డివిజన్ ఎస్‌ఈ సనోజ్ సాహు, ఏఈఈ లుదిలీప్‌కుమార్, గడాదర్ ప్రధాన్, కేసీ ఫణి పాల్గొన్నారు.