Share News

మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్ష

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:30 AM

విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ గురువారం సమీక్షించారు.

మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్ష

నిధుల సమీకరణకు సంబంధించి అధికారులతో చర్చించిన వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌

విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ గురువారం సమీక్షించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతి, కీలక అంశాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు కాలపరిమితి, అమలులో ఎదురవుతున్న సవాళ్లు, వేగంగా పనులు చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుకు రూ.2,618 కోట్లు అవసరమని అధికారులు వెల్లడించగా, తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చే జాతీయ బ్యాంకులను గుర్తించాలని సూచించారు. ప్రాజెక్టుపై రుణభారం తగ్గించేందుకు రాష్ట్ర పన్నులు, జీఎస్‌టీ మినహాయింపు కోసం ఆయా శాఖల అధికారులతో సంప్రతింపులు చేయాలన్నారు. వ్యయాన్ని ఎంతవరకు తగ్గించవచ్చునో కొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, మెట్రో రైలు ఫైనాన్స్‌ సీజీఎం యుజెఎం రావు, ప్రాజెక్ట్స్‌ సీజీఎం బ్రహ్మానందం, ఆర్‌డీఓ సుధాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.


జీసీసీ ఎండీగా ఎస్‌.ఎస్‌.శోభిత బాధ్యతల స్వీకారం

విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):

గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారిణి ఎస్‌.ఎస్‌.శోభిత గురువారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన వెంటనే అధికారులతో సమావేశం నిర్వహించి అమలు చేస్తున్న కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. అరకు కాఫీ మార్కెటింగ్‌, గిరిజన ఉత్పత్తుల సేకరణ, ఇతర సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రధాన కార్యాలయంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం విజిలెన్స్‌, మార్కెటింగ్‌, రిటైల్‌ మార్కెటింగ్‌, కాఫీ, అడ్మిన్‌, అకౌంట్స్‌, రవాణా విభాగాలను పరిశీలించారు.


30న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

15 అంశాలతో అజెండా

గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి బదలాయింపు, క్రమబద్ధీకరణకు ప్రతిపాదన

విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 30న జరిగే జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి 15 అంశాలతో అజెండాను తయారుచేశారు. అజెండా కాపీలను సభ్యులకు పంపిణీ చేస్తున్నట్టు కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీకి బదలాయింపు, క్రమబద్ధీకరించే అంశాన్ని అజెండాలో పొందుపరిచారు. అలాగే జోన్‌-2 పరిధి ఆరో వార్డులో సాయిప్రియ లేఅవుట్‌కు బక్కన్నపాలెం గ్రామంలో రూ.76.6 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణం, 98వ వార్డు పరిధిలోని సింహాచలంలో తొలిపావంచా జంక్షన్‌ వద్ద రూ.1.25 కోట్లతో అభివృద్ధి పనులు, భీమిలి జోన్‌ పరిధి రెండో వార్డులో సంగివలస నుంచి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ మధ్య రూ.1.43 కోట్ల వ్యయంతో మైనర్‌ బ్రిడ్జి నిర్మాణం, జోన్‌-2 ఎనిమిదో వార్డు పరిధి పాతమధురవాడలో రూ.1.7 కోట్లతో శ్మశాన వాటిక అభివృద్ధి, అనకాపల్లి జోన్‌ 82వ వార్డు పరిధి రెల్లివీధిలో రూ.75 లక్షల వ్యయంతో కల్యాణ మండపం నిర్మాణం అంశాలను అజెండాలో చేర్చారు. ఇంకా 45వ వార్డులోని ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని ఏపీ టిడ్కో గృహసముదాయం పక్కన జీ+1 తరహాలో రూ.74 లక్షల వ్యయంతో కల్యాణ మండపం నిర్మాణం, కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులోని బయో గ్యాస్‌ ప్లాంట్‌ కాలవ్యవధిని పొడిగింపు, ప్రజారోగ్య విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా ఆరేళ్లకు మించి పనిచేస్తున్న వారికి స్పెషల్‌ ప్రమోషన్‌ పే స్కేల్‌ వర్తింపుతోపాటు మరికొన్ని పరిపాలనాపరమైన అంశాలను అజెండాలో చేర్చారు.


ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని చినముషిడివాడ, షీలానగర్‌లలో గల ఐయాన్‌ డిజిటల్‌ సెంటర్లలో గురువారం రెండో రోజు జేఈఈ మెయిన్స్‌ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మూడు కేంద్రాల్లో 3,800 మందికిగాను 3,700 మంది పరీక్షలకు హాజరయ్యారు.

Updated Date - Jan 23 , 2026 | 12:30 AM