Share News

సహాయక చర్యల పరిశీలన

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:43 AM

జిల్లాలో ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టారని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. పాడేరు, హుకుంపేట మండలాల్లోని తుఫాన్‌ సహాయక చర్యలను గురువారం ఆమె పరిశీలించారు.

సహాయక చర్యల పరిశీలన
పాడేరులో విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణపై సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

- పనులను పర్యవేక్షించిన కలెక్టర్‌

పాడేరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టారని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. పాడేరు, హుకుంపేట మండలాల్లోని తుఫాన్‌ సహాయక చర్యలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందస్తుగానే సన్నద్ధం కావడంతో పాటు మండల, గ్రామ స్థాయిల్లోనూ అధికారులు, సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఫలితంగా జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టాలు పెద్దగా సంభవించలేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో గురుకుల బాలికల పాఠశాల వద్ద కూలిన ప్రహారి గోడను, మెయిన్‌రోడ్డులో విద్యుత్‌ స్తంభాల పునరుద్ధరణ, పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం హుకుంపేట మండలాన్ని సందర్శించి చీడిపుట్టు గెడ్డను పరిశీలించారు. భారీ వరద ప్రవాహానికి దెబ్బతిన్న చీడిపుట్టు కాజ్‌వేకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌, జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే పరిమిళ, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, ఎంపీడీవో తేజ్‌రతన్‌, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌.రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 12:43 AM