బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:53 AM
లిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్ర, ఒడిశా అధికారులు బుధవారం బలిమెల వోహెచ్సీసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2026- 2027 నీటి సంవత్సరంలో ఏ రాష్ట్రం తమ వాటాగా ఇప్పటి వరకు (సెప్టెంబరు నెలాఖరు వరకు) ఎంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు.
- బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు 112.8188 టీఎంసీలు
- ఆంధ్రా వాటా 68.3458, ఒడిశాకు 44.4730 టీఎంసీల పంపకం
సీలేరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్ర, ఒడిశా అధికారులు బుధవారం బలిమెల వోహెచ్సీసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2026- 2027 నీటి సంవత్సరంలో ఏ రాష్ట్రం తమ వాటాగా ఇప్పటి వరకు (సెప్టెంబరు నెలాఖరు వరకు) ఎంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. దీని ప్రకారం 2025- 2026 నీటి సంవత్సరంలో ఒడిశా, ఆంధ్రా కంటే అధికంగా వాడుకున్న 22.6865 టీఎంసీలతో కలిపి ఈ నీటి సంవత్సం (2026- 2027)లో జూలై నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి మొత్తంగా 30.1675 టీఎంసీలు వినియోగించుకున్నట్టు లెక్కలు కట్టారు. అలాగే ఆంధ్రా తన వాటాగా 2026- 2027 నీటి సంవత్సరంలో జూలై ఒకటి నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి కేవలం 6.2948 టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఒడిశా, ఆంధ్రా కంటే ఇప్పటి వరకు 23.8727 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం బలిమెలలో 73.3600 టీఎంసీలు, జోలాపుట్టులో 28.4588 టీఎంసీల నీటి నిల్వలు కలిపి మొత్తంగా 101.8188 టీఎంసీల నిల్వలు ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి బలిమెల జలాశయానికి నదీపరివాహక ప్రాంతాల నుంచి 8 టీఎంసీలు, జోలాపుట్టు జలాశయానికి 3 టీఎంసీలు కలిపి మొత్తంగా 11 టీఎంసీల నీటి నిల్వలు వచ్చి చేరతాయని అంచనా వేశారు. దీంతో బలిమెల, జోలాపుట్టు జలాశయంలో మొత్తంగా 112.8188 టీఎంసీల నీటి నిల్వలు ఉంటాయని అంచనాకు వచ్చారు. ఇందులో ఆంధ్రా వాటాగా 68.3458 టీఎంసీలుగా, ఒడిశా వాటాగా 44.4730 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. అలాగే ప్రస్తుతం విద్యుదుత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఒడిశా 4 వేల క్యూసెక్కుల నీటిని, ఆంధ్రప్రదేశ్ 2,300 క్యూసెక్కుల నీటిని వినియోగంచుకోవడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా తరఫున బలిమెల హైడ్రో ప్రాజెక్టు యూనిట్ హెడ్ దుర్గాప్రసాద్ పట్నాయక్, టెక్నికల్ హెడ్ ఓంప్రకాష్నాయక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎలక్ర్టికల్) ఎం.ఆనందరావు, మేనేజర్ (ఎలక్ర్టికల్) కైబల్య డాల్, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ర్టికల్) ప్రశాంతకుమార్ ఐచ్, పొట్టేరు చీఫ్ కన్స్ట్రక్ష న్ ఇంజనీర్ (సివిల్) తృపాకుమార్ పాత్ర, ఎస్ఈ (సివిల్) కైలాష్ సీహెచ్ సేతీ, ఏఈఈ (సివిల్) అభిలాష్ ప్రధాన్, జేఈ విభూటి బెహరా, ఆంధ్రా తరఫున ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్సు అధికారులు ఎస్ఈ (సివిల్) షేక్ జాకీర్ హుస్సేన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.అప్పలనాయుడు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చింతాటి సురేశ్ పాల్గొన్నారు.