Share News

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:12 AM

ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశా మల్కన్‌గిరి జిల్లా బలమెల జలవిద్యుత్‌ కేంద్రంలో సమావేశమయ్యారు. ఇరు రాష్ర్టాల నీటి వినియోగంపై సమీక్షించారు.

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
సమావేశమైన ఆంధ్రా, ఒడిశా అధికారులు

ఆంధ్రా వాటాగా 25.0071, ఒడిశాకు 2.3205 టీఎంసీల పంపకం

సీలేరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశా మల్కన్‌గిరి జిల్లా బలమెల జలవిద్యుత్‌ కేంద్రంలో సమావేశమయ్యారు. ఇరు రాష్ర్టాల నీటి వినియోగంపై సమీక్షించారు. ఈ ఏడాది జూన్‌ నెలాఖరుతో 2025- 2026 నీటి సంవత్సరం ముగియడంతో ఆ సంవత్సరంలో ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాలు తమ వాటాగా ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించుకున్నారో లెక్కలు కట్టారు. దీని ప్రకారం గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఆంధ్రా తన వాటాగా 72.7539 టీఎంసీల నీటిని వినియోగించుకుందని, ఒడిశా తన వాటాగా 95.4404 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం 2025- 2026 నీటి సంవత్సరంలో ఆంధ్రా కంటే ఒడిశా 22.6865 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు ఇరు రాష్ర్టాల అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 1,459.40 అడుగుల నీటిమట్టం ఉండగా, ఇక్కడ 15.8350 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, అలాగే జోలాపుట్టులో 2,714.20 అడుగుల నీటిమట్టం ఉండగా, ఇక్కడ 7.9926 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు కట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ నెలాఖరు నాటికి బలిమెల పరివాహక ప్రాంతాల నుంచి 2.5000 టీఎంసీలు, జోలాపుట్టుకు ఒక టీఎంసీ నీటి నిల్వలు వచ్చి చేరతాయని అంచనా వేశారు. దీని ప్రకారం బలిమెల, జోలాపుట్టులో మొత్తంగా 27.3276 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఆంధ్రాకు 25.0071 టీఎంసీల, ఒడిశాకు 2.3205 టీఎంసీలుగా ఇరు రాష్ర్టాల మధ్య పంపకాలు జరిగాయి. ఈ సమావేశంలో ఒడిశా తరఫున బలిమెల హైడ్రో కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. ఆనందరావు, జనరేషన్‌ డివిజన్‌ మేనేజర్‌ కైవల్య దళ్‌, ఎలక్ర్టికల్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రశాంతకుమార్‌ ఐచ్‌, పొట్టేరు ఇరిగేషన్‌ ప్రాజెక్టు చీఫ్‌ కనస్ట్రక్షన్‌ ఇంజనీర్‌ తృపాకుమార్‌ పాత్ర, చిత్రకొండ ఎర్త్‌డ్యాం డివిజన్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కైలాస్‌ సీహెచ్‌ సేతి, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ తుషార్‌ రంజన్‌ కుంటియా, జూనియర్‌ ఇంజనీర్‌ జ్యోతి టాప్‌నోలు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ షేక్‌ జకీర్‌ హుస్సేన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ టి.అప్పలనాయుడు, ఏఈఈ సీహెచ్‌ సురేశ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:12 AM