Share News

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:01 AM

ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఓహెచ్‌సీసీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
మల్కన్‌గిరి చిత్రకొండలో సమావేశమైన ఒడిశా, ఆంధ్ర అధికారులు

ఏపీకి 27.5290, ఒడిశాకు 5.5610 టీఎంసీల పంపకం

సీలేరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఓహెచ్‌సీసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నీటి వినియోగం పంపకాలపై లెక్కలు కట్టారు. మే నెలలో ఒడిశా 9.0033 టీఎంసీలు, ఆంధ్ర 6.5680 టీఎంసీలు వినియోగించుకుంది. ఆంధ్ర కంటే ఒడిశా 2.4353 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు అధికారులు తేల్చారు. ప్రస్తుతం జోలాపుట్టులో 5.6730 టీఎంసీలు, బలిమెల జలాశయంలో 24.9170 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, జూన్‌ నెలాఖరు నాటికి జోలాపుట్టుకు ఒక టీఎంసీ, బలిమెలకు 1.5 టీఎంసీలు నది పరివాహక ప్రాంతాల నుంచి చేరుతుందని అంచనా వేశారు. ఈ మేరకు బలిమెల, జోలాపుట్టులో 33.0900 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నీటి నిల్వల్లో ఆంధ్ర వాటాగా 27.5290 టీఎంసీలు, ఒడిశా 5.5610 టీఎంసీలు వినియోగించుకోవాలని పంపకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున పొట్టేరు ఇరిగేషన్‌ సీఈ కృపాకుమార్‌ పాత్ర, చిత్రకొండ ఎర్త్‌ డ్యామ్‌ డివిజన్‌ ఎస్‌ఈ కైలాస్‌ చంద్రసేతి, ఏఈఈ కేసీ ఫణి, జూనియర్‌ ఇంజనీర్‌ జ్యోతిర్మయి దాస్‌, ఆంధ్ర తరఫున పి.సీతారాం(ఏసీఈ), ఈఈ టి.అప్పలనాయుడు, ఏడీఈలు ఎస్‌.జైపాల్‌, డి.శ్యామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:01 AM