బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - May 14 , 2026 | 12:52 AM
ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశాలోని ఒనకఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు 45.8012 టీఎంసీలు
ఆంధ్రా వాటా 32.66695, ఒడిశా వాటా 13.13425 టీఎంసీలుగా పంపకం
సీలేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ర్టాల అధికారులు బుధవారం ఒడిశాలోని ఒనకఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ర్టాలు 2025- 2026 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఎంతె ంత నీటిని వినియోగించుకున్నాయో లెక్కించారు. ఈ నీటి సంవత్సరంలో ఏప్రిల్ 2026 నాటికి ఒడిశా 77.3178 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు, ఆంధ్రా తన వాటాగా ఏప్రిల్ 2026 నాటికి 57.7851 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు లెక్కలు కట్టారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా.. ఆంధ్రా కంటే 19.5327 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు తేల్చారు. ప్రస్తుతం బలిమెలలో 37.27 టీఎంసీలు, జోలాపుట్టులో 6.6312 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి బలిమెలకు నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక టీఎంసీ నీటి నిల్వలు చేరతాయని, జోలాపుట్టుకు 0.90 టీఎంసీల నీటి నిల్వలు వచ్చి చేరతాయని, వీటన్నింటితో కలిపి బలిమెల, జోలాపుట్టుల్లో మొత్తంగా 45.8012 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు కట్టారు. ఇందులో ఏపీ వాటాగా 32.66695 టీఎంసీలు, ఒడిశా వాటాగా 13.13425 టీఎంసీలుగా పంపకాలు జరిపారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంధ్రా ఆరు వేల క్యూసెక్కులు, ఒడిశా 3,100 క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా తరఫున బలిమెల ఓహెచ్‌పీసీ టెక్నికల్ వింగ్ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్ నాయక్, డివిజనల్ హెచ్‌ఆర్ మేనేజర్ బిమలటర్కీ, మేనేజర్ క్షౌనేశ్ బెహరా, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్, పొట్టేరు ఇరిగేషన్ చీఫ్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్ తృపాకుమార్ పాత్ర, ఎస్‌ఈ (సివిల్) కైలాస్ సీహెచ్ సేతీ, ఏఈఈ దిలీప్‌కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ కేసీ ఫణి, జూనియర్ ఇంజనీర్ జ్యోతి టాప్‌నో, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ షేక్ జాకీర్‌హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు, ఏడీఈ జైపాల్ పాల్గొన్నారు.