బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:46 PM
ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం ఒడిశాలోని బలిమెలలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు 56.7698 టీఎంసీలు
ఏపీ వాటాగా 38.9702, ఒడిశా వాటాగా 17.7996 టీఎంసీలు
నీటి పంపకాలకు ఆమోదం తెలిపిన ఇరు రాష్ట్రాల అధికారులు
సీలేరు, ఏప్రిల్ 16 (ఆంద్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం ఒడిశాలోని బలిమెలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025-2026 నీటి సంవత్సరంలో ఏ రాష్ట్రం తమ వాటాగా ఎంతెంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. ఈ నీటి సంవత్సరంలో మార్చి నెలలో ఆంధ్రా తన వాటాగా అత్యధికంగా 11.5958 టీఎంసీలు, ఒడిశా 6.4559 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు తేల్చారు. అలాగే 2025-2026 నీటి సంవత్సరంలో 2025 జూలై నుంచి 2026 మార్చి నెలాఖరు నాటికి ఒడిశా మొత్తంగా 70.2193 టీఎంసీల నీటిని వినియోగించుకుందని, ఆంధ్రప్రదేశ్ తన వాటాగా ఇప్పటి వరకు 49.0488 టీఎంసీలు వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా.. ఆంధ్రా కంటే 21.1705 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు తేల్చారు. ప్రస్తుతం బలిమెలలో 44.5350 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, జోలాపుట్టులో 10.8348 టీఎంసీలు ఉన్నాయని, ఈ రెండు జలాశయాల్లో మొత్తంగా 55.3698 టీఎంసీల నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఈ నెలాఖరు నాటికి ఈ రెండు జలాశయాల పరివాహక ప్రాంతాల నుంచి మరో 1.400 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని, దీంతో మొత్తం 56.7698 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఈ నీటి నిల్వల్లో ఏపీకి 38.9702 టీఎంసీలు, ఒడిశాకు 17.7996 టీఎంసీలగా పంపకాలు చేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తంగా ఏపీకి ఆరు వేల క్యూసెక్కులు, ఒడిశాకు 2,100 క్యూసెక్కుల నీటిని ఏప్రిల్ నెలాఖరు వరకు వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఒడిశా తరఫున బలిమెల ప్రాజెక్టు సీనియర్ జనరల్ మేనేజర్ దిలీప్‌కుమార్ స్వన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓంప్రకాశ్ నాయక్, మేనేజర్ విమలా టీర్‌కే, డిప్యూటీ మేనేజర్లు కె.చంద్ర బెహరా, రాకేష్ పాణిగ్రహి, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ ఐచ్, పొట్టేరు ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ తృపాకుమార్ పాత్రో, ఎస్‌ఈ కైలాస్ సేతి, బలిమెల ఎర్త్ డ్యామ్ డివిజన్ ఏఈఈలు తుషార్ రంజన్ కుంతై, దిలీప్‌కుమార్, దల బెహరా పాల్గొన్నారు. ఏపీ తరఫున సీలేరు కాంప్లెక్స్ జెన్‌కో అధికారులు ఎస్‌ఈ షేక్ జాకీర్ హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు, ఏఈఈ సీహెచ్ సురేశ్ పాల్గొన్నారు.