బలిమెల నీటి పంపకాలపై సమీక్ష
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:40 AM
ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం జీకే వీధి మండలం సీలేరు జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు.
ఆంధ్రా వాటాగా 32.9429, ఒడిశా వాటాగా 8.9068 టీఎంసీలు వినియోగించుకోవాలని నిర్ణయం
సీలేరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం జీకే వీధి మండలం సీలేరు జెన్‌కో అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఏ రాష్ట్రం తమ వాటాగా ఎంతెంత నీటిని వినియోగించుకున్నదనే అంశంపై సమీక్ష జరిపారు. 2025-26 నీటి సంవత్సరంలో ఒడిశా ఆంధ్ర కంటే 22.6865 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. 2026- 27 నీటి సంవత్సరంలో జూలై నెలలో ఒడిశా తన వాటాగా 5.5065 టీఎంసీల నీటిని వినియోగించుకోగా, ఆంధ్ర తన వాటాలో 4.1569 టీఏంసీల నీటిని వినియోగించుకుంది. దీని ప్రకారం జూలై నెలలో కూడా ఒడిశా ఆంధ్ర కంటే 0.3596 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుంది. ప్రస్తుతం బలిమెల రిజర్వాయర్‌లో 22.7650 టీఎంసీల నీటి నిల్వలు, జోలాపుట్టులో 13.8497 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బలిమెల జలాశయానికి 4,500 క్యూసెక్కులు, జోలాపుట్టుకు 1,5000 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని అంచనా వేశారు. దీని ప్రకారం బలిమెల, జోలాపుట్టులో మొత్తం 41.8497 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఇందులో ఆంధ్రా వాటాగా 32.9429 టీఎంసీలు, ఒడిశా వాటాగా 8.9068 టీఎంసీలుగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య నీటి పంపకాల ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఇరిగేషన్, విద్యుదుత్పత్తి అవసరాల మేరకు ఒడిశా 800 క్యూసెక్కుల నీటిని, ఆంధ్ర 6,000 క్కూసెక్కుల నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏకగ్రీవంగా ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఆంధ్ర తరఫున సీలేరు కాంప్లెక్స్ జెన్‌కో ఎస్‌ఈ షేక్ జాకీర్‌హుస్సేన్, పంప్డ్ స్టోరేజ్ ఎస్‌ఈ సీతారామ్, ఈఈ అప్పలనాయుడు, ఏడీఈ ఎస్.జైపాల్ పాల్గొనగా, ఒడిశా తరఫున బలిమెల హైడ్రోప్రాజెక్టు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓమ్ ప్రకాష్ నాయక్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం.ఆనందరావు, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్, చిత్రకొండ ఎర్త్‌డ్యామ్ డివిజన్ అఽధికారులు కైలాష్, సీహెచ్ సేతి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజన్ కుంతియా, జూనియర్ ఇంజనీర్ జ్యోతి తపాన్ పాల్గొన్నారు.