రెవెన్యూ పోకడ!
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:57 AM
జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం కొత్త పోకడలు పోతోంది. మండలాల బాధ్యతలు నిర్వర్తించాల్సిన తహశీల్దార్లను అప్రాధాన్య పోస్టుల్లో నియమించి, ఆ బాధ్యతలను డిప్యూటీ తహశీల్దార్లకు అప్పగిస్తోంది.
తహశీల్దార్లకు అప్రాధాన్య పోస్టులు
డీటీలకు మండలాల బాధ్యతలు
ప్రజా ప్రతినిధులు, యూనియన్ నేతల ఒత్తిడే కారణం?
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం కొత్త పోకడలు పోతోంది. మండలాల బాధ్యతలు నిర్వర్తించాల్సిన తహశీల్దార్లను అప్రాధాన్య పోస్టుల్లో నియమించి, ఆ బాధ్యతలను డిప్యూటీ తహశీల్దార్లకు అప్పగిస్తోంది. దీంతో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరవడతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డీటీల నుంచి తహశీల్దార్లుగా పదోన్నతి పొందిన అధికారుల పోస్టింగ్స్‌లో జిల్లా యంత్రాంగం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. పదోన్నతి పొందిన ఇద్దరు అధికారులకు రెండు మండలాల తహశీల్దార్లుగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదే ఉత్తర్వుల్లో వారిని కలెక్టరేట్, పౌర సరఫరాల శాఖలో డిప్యూటేషన్‌పై నియమించి, వారి బాధ్యతలను ఇద్దరు డీటీలకు అప్పగించింది. ఏపీఐఐసీలో డీటీగా పనిచేస్తున్న టి.శ్యామలక్ష్మికి పదోన్నతి రావడంతో పెందుర్తి తహశీల్దారుగా పోస్టింగ్ ఇచ్చి, వెంటనే ఆమెను డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌లో నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ప్రస్తుతం పౌరసరఫరాల శాఖలో డీటీగా పనిచేస్తూ పదోన్నతి పొందిన కె.రామలక్ష్మికి గాజువాక తహశీల్దారుగా పోస్టింగ్ ఇచ్చి, వెంటనే పౌర సరఫరాల శాఖలో డిప్యూటేషన్‌గా నియమించారు. సీతమ్మధార తహశీల్దారు కార్యాలయంలో హెచ్‌డీటీగా పనిచేస్తున్న ఎస్‌ఎ త్రినాథరావును ఉక్కు భూసేకరణ విభాగానికి బదిలీ చేసి, గాజువాక తహశీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అల్లూరి జిల్లా కొయ్యూరు తహశీల్దారు (అడహాక్)గా పనిచేస్తున్న పి.మురళీబాబును సీతమ్మధార హెచ్‌డీటీగా నియమించారు. ప్రస్తుతం పెందుర్తి తహశీల్దారు (అడహాక్) ఐ.వెంకటప్పారావును జిల్లా పౌర సరఫరాల శాఖకు బదిలీ చేసిన యంత్రాంగం, తిరిగి పెందుర్తి తహశీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. విజయనగరం జిల్లా నుంచి వచ్చిన దాడిశెట్టి శైలజను ఖాళీగా ఉన్న పద్మనాభం తహశీల్దారుగా, ప్రస్తుతం అడహాక్ బేసిస్‌లో ఆనందపురం తహశీల్దారుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన ఎస్.శ్రీనుబాబును అక్కడే కొనసాగిస్తూ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా పెందుర్తి, గాజువాక తహశీల్దార్ల పోస్టింగ్స్‌లో ప్రజా ప్రతినిధుల సిఫారసులు, సామాజిక వర్గాల నేపథ్యం, యూనియన్ నేతల ప్రమేయం ఉందనే వాదన రెవెన్యూవర్గాల్లోనే వినిపిస్తోంది. పెందుర్తి అడహాక్ తహశీల్దారుగా ఉన్న వెంకటప్పారావు మండలంలో చెరువుల ఆక్రమణలు నిలువరించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. నగరానికి ఆనుకుని ఎక్కువ చెరువులున్న పెందుర్తిలో వాటి రక్షణకు చర్యలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, గుర్రంపాలెంలోని ముఠా ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలువరించలేకపోయారనే విమర్శలున్నాయి. కాగా పూర్తిస్థాయి తహశీల్దార్లను అప్రాధాన్య పోస్టులలో నియమించి, డీటీలకు మండలాల బాధ్యతలు అప్పగించడంపై రెవెన్యూ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.