Share News

రెవెన్యూ భూ మాయ

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:55 AM

మండలంలో రెవెన్యూ అధికారులు, రాజకీయ నేతలు కుమ్మక్కై ఆన్‌లైన్‌లో భూముల యజమానుల పేర్లను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న వాస్తవ భూ యజమానులు లబోదిబోమంటూ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు.

రెవెన్యూ భూ మాయ
ఎకరన్నపాలెంలో అడిగర్ల అర్జునమ్మ జిరాయితీ భూమి

ఒక భూమి.. మరొకరి పేరు మీద ఆన్‌లైన్‌

ఆలస్యంగా గుర్తించిన బాధితులు

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన

మాకవరపాలెం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెవెన్యూ అధికారులు, రాజకీయ నేతలు కుమ్మక్కై ఆన్‌లైన్‌లో భూముల యజమానుల పేర్లను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న వాస్తవ భూ యజమానులు లబోదిబోమంటూ ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. కొందరికి సత్వరమే న్యాయం జరుగుతుండగా, మరికొందరికి జాప్యం అవుతున్నది. వైసీపీ హయాంలో ఈ తరహా అక్రమాలు ఎన్నో జరిగాయని, కూటమి హయాంలో కూడా కొనసాగడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేస్తున్న రెవెన్యూ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.

మండలంలోని ఎరకన్నపాలెం గ్రామంలో సర్వే నంబరు 566లో 1ఏ/1ఏలో 4.88 ఎకరాల జిరాయితీ భూమి అడిగర్ల అర్జునమ్మకు (భర్త ఎర్రినాయుడు) సంక్రమించింది. ఇందులో మామిడి, జీడిమామిడి తోటలు ఉన్నాయి. అయితే ఈ భూమిని 2021లో అర్జున్‌/రావు అనే పేరుమీద రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో మార్చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన అర్జునమ్మ, ఎర్రినాయుడు.. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో చేపట్టిన భూ రీసర్వేలో సరిచేస్తామని అధికారులు చెప్పారు. కానీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భూమిలో 1.01 ఎకరాలను 25-4-2025న రాచపల్లి గ్రామానికి చెందిన రుత్తల వెంటకరమణ మూర్తి పేరుమీద, 3.87 ఎకరాలను 20-9-2025న రాచపల్లి ఎంపీటీసీ సభ్యుడు రుత్తల యర్రాపాత్రుడు (టీడీపీ మండల అధ్యక్షుడు) పేరుమీద వీఆర్‌వో సాంబశివరావు, ఆర్‌ఐ జట్టి, ఇన్‌చార్జి తహశీల్దార్‌ లోకవరపు రామరావు కలిసి ఆన్‌లైన్‌ చేశారు. ఈ విషయం తెలుకున్న అసలు రైతు అడిగర్ల అర్జునమ్మ, కుటుంబ సభ్యులు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించి స్పీకర్‌.. సదరు భూమిని తిరిగి వారి పేరుమీద ఆన్‌లైన్‌ చేయాలని నర్సీపట్నం ఆర్‌డీవోని ఆదేశించారు. అయితే తహశీల్దార్‌ బి.వెంకటరమణ, ఆర్‌ఐ సాంబశివరావు 13-10-2025న అర్జున్‌/రావు ఖాతా పేరున ఆన్‌లైన్‌ చేశారు. తనకు న్యాయం జరగలేదంటూ అర్జున్నమ్మ హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే గ్రామంలో వారసత్వంగా వస్తున్న దళిత రైతులైన రావాడ సన్యాసిరావుకు సర్వే నంబరు 566-1లో 1ఏ, 1బీలో 95 సెంట్లు, సర్వే నంబరు 566-1లో 1ఏ2లో రావాడ దేవుడమ్మకు 95 సెంట్లు, సర్వే నంబరు 566-1బీలో గుడాల అప్పారావుకు 95 సెంట్లు చొప్పున జిరాయితీ భూమి ఉంది. ఈ ముగ్గురి పేర్లు మీద ఉన్న జిరాయితీ భూమిని 28-3-2025న వీఆర్‌వో సాంబశివరావు, ఆర్‌ఐ జట్టి, తహశీల్దార్‌ లోకవరపు రామారావు కలసి రాచపల్లి గ్రామానికి చెందిన రుత్తల వెంకటరమణమూర్తి పేరు మీద (మొత్తం 2.85 ఎకరాలు) మార్చేశారు. అంతకుముందు సహకార సంఘం నుంచి తీసుకున్న పంట రుణాన్ని రీ-షెడ్యూల్‌ చేసేందుకు రావాడ సన్యాసిరావు తామరం పీఏసీఎస్‌కు వెళ్లగా.. అతని పేరు మీద వుండాల్సిన భూమి రుత్తల వెంకటరమణమూర్తి పేరు మీద వున్నట్టు బయటపడింది. దీంతో ముగ్గురూ కలిసి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు 12-6-2025న తహశీల్దార్‌ బి.వెంకటరమణ, వీఆర్‌వో సాంబశివరావు కలసి తిరిగి దళితులైన ముగ్గురు రైతుల పేర్లు మీద ఆన్‌లైన్‌ చేశారు. అయితే రుత్తల వెంకటరమణమూర్తి రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆర్‌ఓఆర్‌ కోర్టు ద్వారా దళిత రైతులకు నోటీసులు జారీ చేయించారు. దీంతో దళిత రైతులు గత సోమవారం అనకాపల్లి వెళ్లి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో భూముల పరింగా జరుగుతున్న ఇటువంటి తప్పిదాలకు కారకులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం వుందని పలువురు అభిప్రాయపడ్డాతున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:55 AM