Share News

నూతన సంవత్సరంలో రెవెన్యూ కానుక

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:29 AM

భూ యజమానుకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి, పాసుపుస్తకాలను భూయజమానులకు అందజేస్తారు. ఏ గ్రామంలో ఏ రోజున సభ నిర్వహించేదీ ఆయా మండలాల తహశీల్దార్లు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేశారు.

నూతన సంవత్సరంలో రెవెన్యూ కానుక
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన కొత్త పట్టాదారు పాసుపుస్తకంం

నేటి నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

తొమ్మిదో తేదీ వరకు గ్రామాల వారీగా సభలు

భూ యజమానులకు స్వయంగా అందజేత

కవర్‌పై జగన్‌ బొమ్మ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రాజముద్ర

తప్పులు దొర్లితే మార్పులు, చేర్పులకు అవకాశం

పాత పుస్తకాలు ఇచ్చి కొత్తవి తీసుకోవాలని రెవెన్యూ అధికారుల వినతి

చోడవరం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): భూ యజమానుకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి, పాసుపుస్తకాలను భూయజమానులకు అందజేస్తారు. ఏ గ్రామంలో ఏ రోజున సభ నిర్వహించేదీ ఆయా మండలాల తహశీల్దార్లు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫొటోను ముద్రించడంపై భూ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ భూములకు చెందిన పట్టాదారు పాసుపుస్తకాలపై ఆయన ఫొటో ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో భూముల సమగ్ర రీసర్వే చేయించిన అప్పటి ప్రభుత్వం.. సరిహద్దు రాళ్లపైన కూడా జగన్‌ బొమ్మను చెక్కించింది. ఈ రెండు చర్యలతో భూ యజమానుల్లో భయాందోళన ఏర్పడి, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని కూటమి నేతలు గత సాధారణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 373 రెవెన్యూ గ్రామాల్లో శుక్రవారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు గ్రామసభ నిర్వహించి భూ యజమానులకు వీటిని అందజేస్తారు. ఆయా గ్రామాలకు చెందిన భూ యజమానులు ఇప్పటికే తమ వద్ద వున్న పట్టాదారు పాసుపుస్తకాన్ని గ్రామసభలో రెవెన్యూ అధికారులకు అందజేసి, కొత్త పుస్తకాన్ని తీసుకోవాల్సి వుంటుంది. సొంత భూమి వున్నప్పటికీ ఇంతవరకు పట్టాదారు పాసుపుస్తకాలు లేని వారు, ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసినవారు కూడా ఆయా గ్రామసభలకు హాజరై కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పొందాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

తప్పుల సవరణకు అవకాశం

కొత్తగా పంపిణీ చేసే పట్టాదారు పాసుపుస్తకాల్లో ఆధార్‌ కార్డులో వివరాలు, భూముల సర్వే నంబర్లు తప్పుగా నమోదైతే భూ యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటువంటి తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సంబంధిత భూ యజమానులు పట్టాదారు పాసుపుస్తకాన్ని గ్రామ/ వార్డు సచివాలయంలో రెవెన్యూ సిబ్బందికి అందజేస్తే, తప్పులను సవరించి కొత్త పాసుపుస్తకాలను అందిస్తారు.

జిల్లాలో 2,01,841 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు

నర్సీపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రీసర్వే పూర్తి చేసుకున్న 373 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన కొత్త పట్టాదారు పుస్తకాల పంపిణీకీ రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని 24 మండలాలు, రెండు మునిసిపాలిటీలు పరిధిలో మొత్తం 2,01,841 పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. చోడవరం మండలంలో 19 గ్రామాల్లో 15,051 పాసు పుస్తకాలు, మునగపాకలో 22 గ్రామాల్లో 14,598, కశింకోటలో 24 గ్రామాల్లో 14,535, బుచ్చెయ్యపేటలో 22 గ్రామాల్లో 14,,471, కె.కోటపాడులో 20 గ్రామాల్లో 12,724, అనకాపల్లిలో 17 గ్రామాల్లో 10,815, అచ్యుతాపురంలో 15 గ్రామాల్లో 9,112, దేవరాపల్లిలో 21 గ్రామాల్లో 9,038, సబ్బవరంలో 16 గ్రామాల్లో 8,737, ఎలమంచిలిలో ఎనిమిది గ్రామాల్లో 7,611, పరవాడలో తొమ్మిది గ్రామాల్లో 6,148, రాంబిల్లిలో ఆరు గ్రామాల్లో 3,565, మాడుగులలో 27 గ్రామాల్లో 10,485, రావికమతంలో 19 గ్రామాల్లో 10,087, పాయకరావుపేటలో 14 గ్రామాల్లో 8,892, చీడికాడలో 20 గ్రామాల్లో 8,067, కోటవురట్లలో 11 గ్రామాల్లో 6,215, నక్కపల్లిలో 13 గ్రామాల్లో 6,027 మాకవరపాలెంలో 13 గ్రామాల్లో 5,849, రోలుగుంటలో 14 గ్రామాల్లో 4,777, నర్సీపట్నంలో ఏడు గ్రామాల్లో 4,578, గొలుగొండలో 18 గ్రామాల్లో 4,506, ఎస్‌.రాయవరంలో ఆరు గ్రామాల్లో 4,499, నాతవరంలో 12 గ్రామాల్లో 1,454 పట్టాదారు పాసుపుస్తకాలను భూ యజమానులకు రైతులకు అందజేస్తారు. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డులో శుక్రవారం ఉదయం నిర్వహించే కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయడానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jan 02 , 2026 | 12:29 AM