Share News

భూ కబ్జాకు రెవెన్యూ సహకారం?

ABN , Publish Date - Jul 07 , 2026 | 01:27 AM

పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో గల ప్రభుత్వ భూమి కబ్జా వెనుక కొందరు రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూ కబ్జాకు రెవెన్యూ సహకారం?

పీఎం పాలెంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించిన వారికి కొందరు సిబ్బంది అండదండలు ఉన్నట్టు ప్రచారం

గతంలో అదే భూమిలో రోడ్డు నిర్మించారంటూ ఒక మహిళపై పోలీసులకు ఫిర్యాదు

ఇప్పుడు ఏకంగా భూమిని చదును చేసేసినా పట్టించుకోకపోవడంపై అనుమానాలు

కనీసం కబ్జాదారులను గుర్తించేందుకు యత్నించిని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో గల ప్రభుత్వ భూమి కబ్జా వెనుక కొందరు రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజులపాటు యంత్రాలతో చదును చేసినా కనీసం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం, స్థానికులు ఫిర్యాదు చేసినా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇంతవరకూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. భూమిని చదును చేసి ఆధీనంలోకి తెచ్చుకోవాలని రెవెన్యూ సిబ్బందే కబ్జాదారులకు సలహా ఇచ్చారని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపాన పాత ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక సర్వే నంబర్‌ 20-4లో గల 2.82 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసేందుకు యత్నించడంపై ‘ప్రభుత్వ భూమికి ఎసరు’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూమిని యంత్రాలతో చదును చేస్తుండడంపై చినగదిలి రెవెన్యూ అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా, అది ప్రభుత్వానికి చెందినదేనని స్పష్టంచేశారు. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ అక్కడి నుంచి యంత్రాలతోపాటు మనుషులు కూడా హఠాత్తుగా మాయమైపోయారు. అయితే అప్పటికే స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫోన్‌ చేసి ప్రభుత్వ భూమిని ఎవరో యంత్రాలతో చదును చేస్తున్నారని, ప్రశ్నించిన తమకు దురుసుగా సమాధానం చెబుతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదనే ప్రచారం జరుగుతోంది. కబ్జాదారులతో రెవెన్యూ శాఖలో కొందరు సిబ్బంది ముందస్తు అవగాహన కదుర్చుకుని ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్‌ వేశారనే ప్రచారం జరుగుతోంది. రాత్రికి రాత్రే చదును చేసి, తర్వాత ప్రహరీ గోడ నిర్మించేసి పొజిషన్‌లోకి వెళ్లిపోతే తర్వాత కోర్టు ద్వారా కథ నడిపించేయవచ్చునని కబ్జాదారులకు కొందరు రెవెన్యూ సిబ్బంది సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకరోజు రాత్రికి రాత్రే యంత్రాలను ప్రభుత్వ భూమిలో దింపి చదును చేసే పనులను మరుసటిరోజు మధ్యాహ్నం వరకు సాగించారని, ఆ తర్వాత ‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం అందడం, వారు రెవెన్యూ అధికారుల వివరణ కోరడంతో కబ్జా యత్నానికి బ్రేక్‌ పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అదే భూమిలో డెబ్రిస్‌తో రోడ్డు నిర్మించారంటూ ఒక మహిళపై అప్పటి చినగదిలి తహశీల్దార్‌ పీఎం పాలెం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి సదరు మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ భూమిని యంత్రాలతో చదును చేసినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ప్రభుత్వ భూమిలో ఎవరైనా యంత్రాలతో పనులు చేస్తున్నట్టు సమాచారం అందితే వెంటనే స్థానిక సిబ్బందిని అక్కడికి పంపించి ఫొటోలు, వీడియోలు తీయించి పోలీసుల సహాయంతో వాటిని సీజ్‌ చేయిస్తారు. అలాగే దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తారు. ఒకవేళ రెవెన్యూ సిబ్బంది అక్కడకు వెళ్లేసరికి యంత్రాలు, మనుషులు ఎవరూ లేకపోతే స్థానికుల నుంచి సమాచారం సేకరించడం లేదంటే సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలి. అంత రిస్క్‌ తమకెందుకని భావిస్తే గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించారని పేర్కొంటూ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే వారే దర్యాప్తుచేసి తగిన ఆధారాలు సంపాదించి కబ్జాకు పాల్పడిన వ్యక్తులపైనా, పనులు చేసిన యంత్రాల యజమానులపైనా కేసు నమోదుచేస్తారు. అయితే పీఎం పాలెంలో సుమారు రూ.75 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నించిన వారిపై చినగదిలి తహశీల్దార్‌ కార్యాలయ అధికారులుగానీ, సిబ్బంది గానీ పోలీసులకు ఇంతవరకూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

Updated Date - Jul 07 , 2026 | 01:27 AM