Share News

రెవెన్యూ కాంప్లెక్స్‌ రెడీ

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:53 AM

ఏళ్ల తరబడి సొంతగూడు లేక ఇరుకు భవనాల్లో నడుస్తున్న రెవెన్యూ, ట్రెజరీ కార్యాలయాలకు త్వరలోనే వసతి కష్టాలు తీరనున్నాయి. గతంలో టీడీపీ హయాంలో భవన నిర్మాణం చేపట్టగా, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు గాలికొదిలేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం కోటిన్నర రూపాయలు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు పునఃప్రారంభం అయ్యాయి.

రెవెన్యూ కాంప్లెక్స్‌ రెడీ
తుది మెరుగులు దిద్దుకుంటున్న రెవెన్యూ కాంప్లెక్స్‌ భవనం. 12సీడీఎం3 (ఇన్‌సెట్‌లో) వైసీపీ హయాంలో భవనం పరిస్థితి..

చోడవరంలో తుది దశకు చేరిన నూతన భవన నిర్మాణం

శ్రావణ మాసంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

తహశీల్దారు, సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు తీరనున్న వసతి సమస్య

చోడవరం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి సొంతగూడు లేక ఇరుకు భవనాల్లో నడుస్తున్న రెవెన్యూ, ట్రెజరీ కార్యాలయాలకు త్వరలోనే వసతి కష్టాలు తీరనున్నాయి. గతంలో టీడీపీ హయాంలో భవన నిర్మాణం చేపట్టగా, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు గాలికొదిలేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం కోటిన్నర రూపాయలు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు పునఃప్రారంభం అయ్యాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తిచేసి, శ్రావణమాసంలో ప్రారంభించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

చోడవరంలోని రెవెన్యూ కార్యాలయం భవనాలను సుమారు 25 ఏళ్ల క్రితం మావోయిస్టులు (పీడబ్ల్యూజీ నక్సలైట్లు) బాంబులు పెట్టి పేల్చివేశారు. దీంతో భవనం బాగా దెబ్బతిన్నది. కొంతకాలంపాటు శిథిల భవనంలోనే రెవెన్యూ కార్యాలయాన్ని కొనసాగించారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలుగుతుండడంతో వెలుగు కార్యాలయానికి చెందిన స్త్రీశక్తి 2016లో టీడీపీ అధికారంలో వున్నప్పుడు భవన నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. భవన నిర్మాణ పనులు ప్రారంభించి, రెండు అంతస్థులకు పిల్లర్లు, శ్లాబు వేశారు. మిగిలిన పనులకు నిధులు చాలకపోవడంతో ముందుకు కదలలేదు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం.. చోడవరంలో అసంపూర్తిగా వున్న రెవెన్యూ కార్యాలయం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ విజయకృష్ణన్‌లతో మాట్లాడి, తహశీల్దారు కార్యాలయం భవన నిర్మాణం పూర్తిచేయడానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. దీంతో వారిద్దరూ చోడవరం వచ్చి అసంపూర్తిగా వున్న భవనాన్ని పరిశీలించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రూ.1.2 కోట్లు మంజూరు చేశారు. దీంతో పనులు పునఃప్రారంభించారు. గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పుట్టీ పనులు జరుగుతున్నాయి. తరువాత ఫ్లోరింగ్‌, విద్యుత్‌, ప్లంబింగ్‌ తదితర పనులు పూర్తిచేసి, శ్రావణ మాసంలో ప్రారంభోత్సవం చేయించాలని స్థానిక ఎమ్మెల్యే రాజు భావిస్తున్నారు. జీ ప్లస్‌ 2 తరహాలో నిర్మించిన ఈ భవనంలో రెండో అంతస్థులో సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు నిర్మించారు. మొదటి అంతస్థులో రెవెన్యూ కార్యాలయం, కిందన (గ్రౌండ్‌ ఫ్లోర్‌) సబ్‌ ట్రెజరీ కార్యాలయం నిర్వహిస్తారని సమాచారం. దీంతో ఒకేసారి రెవెన్యూ, సబ్‌ట్రెజరీ కార్యాలయాలకు వసతి సమస్య తీరనున్నది.

Updated Date - Jul 13 , 2026 | 12:53 AM