రెవెన్యూ క్లినిక్‌లు సరే.. చికిత్స ఏది?
ABN , Publish Date - May 17 , 2026 | 12:39 AM
భూ సమస్యలకు పారదర్శకంగా, వేగంగా పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌లకు జిల్లాలో స్పందన బాగానే ఉన్నప్పటికీ అర్జీల పరిష్కారంలో మాత్రం వెనుకబడినట్టు తెలుస్తోంది. రీసర్వే లోపాలు, సరిహద్దు వివాదాలు, భూ వర్గీకరణ, కబ్జాలు వంటి దీర్ఘకాలిక సమస్యలపై అందిన అర్జీల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల అలసత్వం, సిబ్బంది కొరత వల్ల అర్జీలకు సత్వర పరిష్కారం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- పేరుకుపోతున్న అర్జీలు
- భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం
- అధికారుల అలసత్వం, సిబ్బంది కొరతే కారణం
- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
భూ సమస్యలకు పారదర్శకంగా, వేగంగా పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌లకు జిల్లాలో స్పందన బాగానే ఉన్నప్పటికీ అర్జీల పరిష్కారంలో మాత్రం వెనుకబడినట్టు తెలుస్తోంది. రీసర్వే లోపాలు, సరిహద్దు వివాదాలు, భూ వర్గీకరణ, కబ్జాలు వంటి దీర్ఘకాలిక సమస్యలపై అందిన అర్జీల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల అలసత్వం, సిబ్బంది కొరత వల్ల అర్జీలకు సత్వర పరిష్కారం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. భూముల సమగ్ర సర్వే నెపంతో గత పాలకులు ప్రభుత్వ, ప్రైవేటు భూముల రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెవెన్యూ పరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో పాటు రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబరు 29వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఇప్పటి వరకు నిర్వహించిన 14 రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అధికారులు పెద్ద సంఖ్యలో వినతులను స్వీకరించారు. రెండు రెవెన్యూ క్లినిక్‌లు రద్దయ్యాయి. జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌లకు మొత్తం 1,885 అర్జీలు అందాయి. వీటిలో 827 అర్జీలు అర్జీలకు మాత్రమే పరిష్కారం చూపారు. 442 తిరస్కరణకు గురికాగా, 616 పెండింగ్‌లో ఉన్నాయి.
పరిష్కారం అంతంతమాత్రమే..
రెవెన్యూ క్లినిక్‌లకు అందుతున్న భూ సంబంధిత సమస్యలు క్లిష్టంగా ఉండడం, క్షేత్రస్థాయి పరిశీలనలు సరిగ్గా జరగకపోవడం వంటి కారణాల వల్ల అందిన ఫిర్యాదుల్లో కొద్ది శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయి. సాధారణంగా రీసర్వేలో లోపాలు, నిషేధిత భూములు (22ఎ) జాబితా నుంచి తొలగింపు, విస్తీర్ణ సవరణలకు సంబంధించిన అర్జీలు ఎక్కువ సంఖ్యలో అందుతున్నప్పటికీ, వాటికి స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌కు అందిన అర్జీలను గ్రామ స్థాయికి కూడా ఆన్‌లైన్ ద్వారా విస్తరించారు. స్థానికంగా తహశీల్దార్ల ఆన్‌లైన్ రికార్డుల్లో రెవెన్యూ క్లినిక్‌లలో అందే అర్జీలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అయితే అధికారుల అలసత్వం, సిబ్బంది కొరత వల్ల అర్జీలకు సత్వర పరిష్కారం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రీసర్వే లోపాలు, సర్వే నంబర్లు తప్పుగా నమోదుకావడం, భూ వర్గీకరణ, విస్తీర్ణ సవరణలు, సరిహద్దు వివాదాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, తదితర సమస్యలపై అర్జీలు అందుతూనే ఉన్నాయి. మండల స్థాయిలో కొందరు రెవెన్యూ, సర్వే సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలుస్తోంది. కొన్ని చోట్ల రెవెన్యూ క్లినిక్‌లకు అందుతున్న అర్జీల పరిష్కారానికి రెవెన్యూ సిబ్బంది బేరాలు కుదుర్చుకుంటున్నారు. రెవెన్యూ క్లినిక్‌లు, ఇతరత్రా సందర్భాల్లో కార్యాలయాలకు అందుతున్న అర్జీలకు సైతం చేతులు తడిపితే గానీ పరిష్కారం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జిల్లాలో ఇద్దరు వీఆర్‌వోలు భూముల మ్యుటేషన్ కోసం అర్జీ పెట్టుకున్న వారి నుంచి లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైనా జిల్లా అధికారులు అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టకపోతే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయే పరిస్థితి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘ఒక నెల- ఒక గ్రామం కార్యక్రమం’ అమలు
రెవెన్యూ క్లినిక్‌లకు అందుతున్న వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రభుత్వం ‘ఒక నెల- ఒక గ్రామం’ కార్యక్రమాన్ని మే నెల నుంచి అమలు చేస్తోంది. ప్రతి మండలంలో నెలకు ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామాన్ని రెవెన్యూ అధికారులు సందర్శించనున్నారు. మొదటి వారంలో ఆ గ్రామంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు. రెండో వారంలో క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలిస్తారు. మూడో వారంలో సమస్య పరిష్కారానికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తారు. నాలుగో వారం గ్రామ సభ నిర్వహించి పెండింగ్ ఫిర్యాదులు, న్యాయపరమైన ఇబ్బందులపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.