పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహించాలి
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:22 AM
ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించేందుకు ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో రెవెన్యూ క్లినిక్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడాలి
మీకోసం వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు
అర్జీలు పరిష్కరించని అధికారులపై చర్యలు
పాడేరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించేందుకు ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో రెవెన్యూ క్లినిక్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. నిషాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యకు సంబంధించిన పత్రాలు, అవసరమైన వివరాలతో ప్రజలు నేరుగా హాజరై అర్జీలు సమర్పించుకోవచ్చునన్నారు. పీజీఆర్‌ఎస్‌కి హాజరు కాలేదని ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి గాని, మీకోసం వెబ్‌సైట్ ద్వారా గాని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీ స్థితి, పరిష్కార సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌కి తిరిగి కాల్ చేయవచ్చునన్నారు. పీజీఆర్‌ఎస్ సేవలు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి కేంద్రాల్లో ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రజల నుంచి వచ్చిన అసంతృప్తిపై జిల్లా స్థాయిలో సమీక్షించనున్నట్టు చెప్పారు. ఫిర్యాదుదారుడితో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడి, సమస్యను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, 1100, సూపర్ ఆడిట్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వ సేవలను 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబరు సాయాన్ని పొందవచ్చునన్నారు.