రెవెన్యూ దూకుడు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:11 AM
ఆస్తిపన్ను బకాయిలపై జీవీఎంసీ రెవెన్యూ అధికారులు దూకుడు పెంచారు.
ఆస్తిపన్ను బకాయిదారులకు జప్తు నోటీసులు
స్పందించని వారి ఆస్తులకు తాళాలు
బకాయిదారుల ఇళ్లకు జీవీఎంసీ అధికారులు
12 రోజుల్లో రూ.32 కోట్ల బకాయిలు, రూ.53 కోట్ల రెగ్యులర్ పన్ను వసూలు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ఆస్తిపన్ను బకాయిలపై జీవీఎంసీ రెవెన్యూ అధికారులు దూకుడు పెంచారు. పన్ను బకాయిలు (అరియర్స్) చెల్లించాలని హెచ్చరిస్తూ జారీ చేసిన జప్తునోటీసులకు స్పందించినవారి ఆస్తులకు తాళం వేసి, సీజ్ చేస్తున్నారు. దీంతో బకాయిదారులకు మరోమార్గం లేక చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గత 12 రోజుల్లో రూ.85 కోట్లు ఆస్తిపన్ను వసూలుకాగా అందులో రూ.32 కోట్లు కేవలం అరియర్స్ కావడం రెవెన్యూ యంత్రాంగం దూకుడుకు అద్దంపడుతోంది.
జీవీఎంసీ పరిధిలో 6,02,937 ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటిద్వారా ప్రతి ఏటా సుమారు రూ.435 కోట్ల ఆస్తిపన్ను వసూలవుతుంది. కాగా యజమానులు సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో బకాయిలుపేరుకుపోతున్నాయి. చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తులకు సంబంధించి రూ.134 కోట్లు బకాయిలు, రెగ్యులర్ పన్ను కింద రూ.436 కోట్లు మొత్తం రూ.570 కోట్లు వసూలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్నుల వసూలు ఆశించినస్థాయిలో లేకపోవడం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. దీంతో కమిషనర్ కేతన్‌గార్గ్ కేవలం ఆస్తిపన్ను వసూళ్లను పెంచడంపైనే దృష్టి కేంద్రీకరించారు. రెవెన్యూ డీసీఆర్ శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్లతో ప్రతి వారం సమీక్ష నిర్వహించి పన్ను వసూళ్లపై టార్గెట్‌లు నిర్దేశించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 1,36,149 మంది పన్ను బకాయిదారులు ఉన్న ట్టు గుర్తించి వారందరికీ తక్షణం అరియర్స్ చెల్లించాలని, లేదంటే ఆస్తులను జప్తుచేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ ఎవరూ స్పందించలేదు. దీం తో వార్డుస్థాయిలో అడ్మిన్ సెక్రటరీ నుంచి ఆర్‌ఐలు, ఆర్‌ఓ లు, జెడ్సీలు, డిప్యూటీ కమిషనర్ వరకు అందరూ ఏడు గంటల నుంచి పన్ను బకాయిదారుల ఇళ్లకు, కార్యాలయాలకు వెళ్లి యజమానులతో చర్చించి వసూలుచేయడంపై పడ్డారు. ఒకవేళ ఎవరైనా పన్ను చెల్లించేందుకు సుముఖంగా లేరని అనిపిస్తే వారి ఆస్తులకు తాళం వేసి జప్తుచేయడం ప్రారంభించారు. ఇలా గత 15రోజుల్లో ఏకంగా 1,500కి పైగా ఆస్తులను జప్తుచేయడం అధికారుల దూకుడుకి అద్దంపడుతోంది. ఆస్తులను జప్తుచేసేస్తుండడంతో యజమానులు బకాయిలు చెల్లించేందుకు పరుగుతు పెడుతున్నారు.విశాఖపోర్టు ట్రస్టు రూ.11 కోట్లు ఆస్తిపన్ను చెల్లిస్తూ ఆదివారం డిప్యూటీ కమిషనర్‌కు చెక్కును అంద జేసింది. జగదాంబ కూడలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి రూ.14లక్షలు పన్ను బకాయి ఉండడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని అధికారులు ఆస్పత్రికి వెళ్లి ప్రతినిధులతో చర్చించి, వసూలుచేశారు. సిరిపురం సర్కిల్‌లోని అశోక్ ఇండస్ర్టీస్‌కు చెందిన ఆస్తికి సంబంధించి రూ.25.87 లక్షలు బకాయి ఉండడంతో అధికారులు శనివారం సీజ్‌చేశారు. ఈనెల తొమ్మిదో తేదీనాటికి రూ.134.24 కోట్ల బకాయిలుండగా కేవలం రూ.49.52 కోట్లు వసూలయింది. ఈనెల 21నాటికి రూ.82 కోట్లు అరియర్స్ వసూలయింది.
రెగ్యులర్ ఆస్తిపన్ను డిమాండ్ రూ.435.78 కోట్లు ఉండగా ఈనెల తొమ్మిది నాటికి రూ.318 కోట్లు వసూలైంది. 21 నాటికి రూ.452 కోట్టుకు చేరింది. అంటే గత 12రోజుల్లో అరియర్స్ ద్వారా రూ.32కోట్లు, రెగ్యులర్ ఆస్తిపన్ను ద్వారా రూ.53 కోట్లు మొత్తం రూ.85 కోట్లు వసూలవడం అధికారులను ఆనందానికి గురిచేస్తోంది. వచ్చేనెల 31 వరకు ఇదే దూకుడు ప్రదర్శిస్తే డిమాండ్ మేరకు ఆస్తిపన్ను, అరియర్స్ వసూలు సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.