Share News

ఉక్కు సలహాదారుగా రిటైర్డు సీజీఎం

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:25 AM

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్టీల్‌ప్లాంటు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది.

ఉక్కు సలహాదారుగా రిటైర్డు సీజీఎం

అంతా ఆయన చెప్పినట్టే వినాలని ప్రత్యేక ఉత్తర్వులు

ఏ మెటీరియల్‌ కొన్నా ఆయనకు ప్రతిపాదనలు సమర్పించి, ఆమోదం తీసుకోవాలి

ప్లాంటు చరిత్రలో ఎన్నడూ లేదంటున్న కార్మిక వర్గాలు

ఉద్యోగులకు మాత్రం పదోన్నతులు ఇవ్వకుండా దోబూచులాట

విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్టీల్‌ప్లాంటు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. గత కొన్నేళ్లుగా పదోన్నతులు నిలిపివేసింది. పదవీ విరమణ తరువాత కొనసాగింపులు ఆపేసింది. కానీ తాము చెప్పినట్టు చేసే సీజీఎంకు మాత్రం అవకాశం ఇచ్చింది. ఆయన ఫిబ్రవరి 28న రిటైర్‌ కాగా, సలహాదారు పదవిని కట్టబెడుతూ ఆగమేఘాలపై సెలవు రోజైన ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్లాంటులో ఏమి చేస్తారు?, ఆయన మాట ఎవరు వినాలి?...వంటి పది అంశాలను పొందుపరుస్తూ ఆదేశాలు ఇచ్చింది.

సాధారణంగా సలహాదారులు డైరెక్టర్లతో అవసరమైనప్పుడు వారానికో, నెలకో సమావేశమై సూచనలు చేస్తారు. కానీ ఆయనే సమావేశాలు నిర్వహిస్తారని, వాటికి హాజరై చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధిపతులు, జనరల్‌ మేనేజర్లు, జీఎం ఇన్‌చార్జులు రోజువారీ నివేదిక, సమాచారం ఆయనకు సమర్పించాలని, సంబంధిత అంశాల్లో ఆయన సలహా తీసుకోవాలని సూచించారు. ప్లాంటుకు అవసరమైన ఏ మెటీరియల్‌ కొన్నా ఆయనకు ముందుగా ప్రతిపాదనలు సమర్పించి, ఆమోదం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన ప్లాంటులో సమగ్ర కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రణాళిక, కెపాసిటీ యుటిలైజేషన్‌ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఇలా అనేక బాధ్యతలతో పాటు, అందరిపై అధికారం చెలాయించే హక్కులు కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే...ఆయనకు సీజీఎంగా పనిచేసిన కాలంలో కంటే ఇప్పుడే ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఇంచుమించు సీఎండీతో సమానంగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఇది దేనికి సంకేతమని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక రిటైర్డ్‌ అధికారికి ఇన్ని అధికారాలు ప్లాంటు చరిత్రలో ఎన్నడూ ఇవ్వలేదని, ఇప్పుడు ఎందుకు ఇచ్చారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆయన హయాంలోనే ఉత్పత్తి ఆధారిత వేతనాలు, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వంటివి జరిగాయని, ఉద్యోగులను మరింత అణగదొక్కడానికే ఈ సలహాదారుని పెట్టారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.


నేడు సింహాచలంలో దర్శనాలు నిలిపివేత

సింహాచలం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మూసివేయనున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, ప్రభాతారాధనలు యథావిధిగా పూర్తిచేసి స్వామివారిని కొండ దిగువకు తీసుకువచ్చి డోలోత్సవం, చూర్ణోత్సవం, గ్రామ తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారిని సింహగిరికి చేర్చి, నిత్యారాధనలు పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఆలయ కవాట బంధనం చేస్తారు. మంగళవారం రోజంతా భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవు.


మే నెలలో పలు రైళ్లు రద్దు, మళ్లింపు

విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాయనపాడు రైల్వే సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపట్టనున్న నేపథ్యంలో మే నెలలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు.

రద్దు చేసిన రైళ్లు: మే 1 నుంచి 4 వరకు విశాఖ-మహబూబ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12861), మే 2 నుంచి 5 వరకు మహబూబ్‌నగర్‌-విశాఖ సూపర్‌ఫాస్ట్‌ (12862), మే 1, 3, 4 తేదీల్లో సంబల్‌పూర్‌-నాందేడ్‌ సూపర్‌ఫాస్ట్‌ (20809), మే 2, 4, 5 తేదీల్లో నాందేడ్‌-సంబల్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ (20810), మే 2న విశాఖ-నాందేడ్‌ సూపర్‌ఫాస్ట్‌ (20811), 3న నాందేడ్‌-విశాఖ సూపర్‌ఫాస్ట్‌ (20812)

మళ్లింపు: విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519) మే 1 నుంచి 4వ తేదీ వరకు విజయవాడ, కృష్ణా కెనాల్‌, గుంటూరు, పగిడిపల్లి మీదుగా (కాజీపేటలో ఆగకుండా), తిరుగు ప్రయాణంలో ఎల్‌టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18520) మే 1 నుంచి 4 వరకూ పగిడిపల్లి, గుంటూరు, కృష్ణా కెనాల్‌, విజయవాడ మీదుగా, విశాఖపట్నం-నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ (12803) మే 4న సింగాపురం రోడ్డు, దుర్గ్‌, నాగపూర్‌, విజయవాడ మీదుగా నడుస్తాయన్నారు.


టెన్త్‌ పరీక్షలకు పర్యవేక్షణాధికారుల నియామకం

విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పర్యవేక్షణాధికారులను నియమించారు. జిల్లాలోని 133 కేంద్రాల్లో పరీక్షల పర్యవేక్షణకు 133 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 133 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లను నియమించారు. వీరందరికీ ఈనెల నాలుగో తేదీన జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు దూరంగా ఉన్న శొంఠ్యాం, చింతల అగ్రహారం, నరవ, గంగవరం, అగనంపూడి, ఇస్లాంపేట, మంగమారిపేట కేంద్రాలకు ప్రత్యేకాధికారులను నియమించనున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 01:25 AM