భూ రికార్డుల ప్రక్షాళనకే రీ సర్వే
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:02 PM
భూముల రికార్డుల ప్రక్షాళనకు చేపడుతున్న రీ సర్వే పనులు పక్కాగా చేపట్టాలని, తప్పులకు తావివ్వొద్దని రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు.
ల్యాండ్ రికార్డ్సు డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో రీ సర్వే తనిఖీ
రైతుల సందేహాలను నివృత్తి చేసిన డైరెక్టర్
ముంచంగిపుట్టు/పెదబయలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
భూముల రికార్డుల ప్రక్షాళనకు చేపడుతున్న రీ సర్వే పనులు పక్కాగా చేపట్టాలని, తప్పులకు తావివ్వొద్దని రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్సు డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. శనివారం ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో రీ సర్వేను ఆయన పరిశీలించారు. ముంచంగిపుట్టు మండలంలోని రాములు గ్రామంలో సర్వే పురోగతిని సమీక్షించారు. అనంతరం రైతులతో మాట్లాడి భూముల సరిహద్దులు, విస్తీర్ణం, రికార్డుల నమోదుపై సందేహాలను నివృత్తి చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే ద్వారా రైతులకు పారదర్శకమైన భూ రికార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పెదబయలు మండలం అల్లంగిపుట్టులో రైతులతో నేరుగా మాట్లాడారు. వారికి రీ సర్వే ఉద్దేశాన్ని వివరించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా రికార్డులను పక్కాగా రూపొందించాలని ఆదేశించారు. ఆయన వెంట సర్వే ఏడీ ఈశ్వర్ దొర, డీఐఎస్ వెంకటరావు, ముంచంగిపుట్టు, పెదబయలు తహశీల్దార్లు వంజంగి త్రినాథరావు నాయుడు, లక్ష్మయ్య, రీ సర్వే అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.