మెట్రోపై రీ సర్వే
ABN , Publish Date - May 10 , 2026 | 12:27 AM
అభివృద్ధి చెందిన అన్ని నగరాల్లో వాహనాల కాలుష్యం తగ్గించడానికి మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నాయని, విశాఖపట్నానికి కూడా మెట్రో రైలు వస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు.
వచ్చే నెలాఖరుకు పూర్తి
కేంద్రానికి మళ్లీ డీపీఆర్ సమర్పిస్తాం
ఏడు మాస్టర్‌ప్లాన్
రహదారుల్లో మూడు పూర్తి
వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్ నేడు ఖరారు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి.నారాయణ
విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి):
అభివృద్ధి చెందిన అన్ని నగరాల్లో వాహనాల కాలుష్యం తగ్గించడానికి మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నాయని, విశాఖపట్నానికి కూడా మెట్రో రైలు వస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేయాలని కేంద్రం ఆదేశించిందని, ఆ మేరకు రీసర్వే జరుగుతోందన్నారు. వచ్చే నెలాఖరుకు ఇది పూర్తవుతుందని, అప్పుడు కేంద్రానికి డీపీఆర్ సమర్పించి, అనుమతులు తీసుకుంటామన్నారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ వీఎంఆర్‌డీఏ చేపట్టిన ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల్లో మూడు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. భోగాపురం వరకు బీచ్ కారిడార్ కూడా వస్తుందన్నారు.
వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌పై శనివారం సమీక్షించామని, ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాల్లో 90 శాతం పరిష్కరించామన్నారు. మిగిలిన 10 శాతం చేయడానికి వీలుకాదని స్పష్టం చేశామన్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులు ప్రస్తుతం నగరంలో లేరని, అందుకని వారి అభిప్రాయాలు తీసుకోవలసి ఉందన్నారు. విజయవాడలో ఆదివారం జరిగే సీఆర్‌డీఏ సమావేశంలో వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్-2041పై పూర్తి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.