Share News

ఆహార ఉత్పత్తుల ప్రచారంపై ఆంక్షలు.!

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:08 AM

ఆహార ఉత్పత్తులకు ప్రచారాన్ని నిర్వహించే సెలబ్రిటీలు, సోషల్‌ మీడి యా ఇన్‌ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారి టీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది.

ఆహార ఉత్పత్తుల  ప్రచారంపై ఆంక్షలు.!

సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో వెల్లువెత్తుతున్న యాడ్స్‌

పూర్తి సమాచారం తెలియకుండా ప్రచారం చేయడంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం

తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక

విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):

ఆహార ఉత్పత్తులకు ప్రచారాన్ని నిర్వహించే సెలబ్రిటీలు, సోషల్‌ మీడి యా ఇన్‌ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారి టీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా సోష ల్‌ మీడియాలో ఆహార ఉత్పత్తుల వివరాలపై స్పష్టత లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తూ ప్రజారోగ్యానికి హాని కలిగించేలా వ్యవహరిస్తుండడంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రచారం చేయాలని భావించే పదార్థం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలని, ముఖ్యంగా తయారీకి వినియోగించిన పదార్థాలు, మోతాదు, దానిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు తెలుసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిన తరువాత నిబంధనలు పాటించకుండా ఎంతోమంది ఆహార ఉత్పత్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వాటిపై కనీస అవగాహన లేకున్నా లాభాపేక్షతో ప్రచారం చేయడం కారణంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనిని కట్టడి చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు తాజాగా హెచ్చరికలను జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

విచ్చలవిడి ప్రచారం

ప్రధానంగా ఫుడ్‌ బ్లాగర్లు, యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు స్థానికంగా ఉండే అనేక రకాల ఆహార ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటువంటివన్నీ దాదాపు పెయిడ్‌ ప్రమోషన్స్‌. ఈ ఆహార ఉత్పత్తులను ఫుడ్‌స్టేఫీ స్టాండర్డ్స్‌ నిబంధనలకు అనుగుణంగా తయారుచేశారా, ఆ వివరాలున్నాయా.? అనేది ప్రచారం చేసేవారు తెలుసుకోవాలి. ఎక్కడా అటువంటి నిబంధనలను పాటించడం లేదని గుర్తించడంతోనే హెచ్చరికలను జారీచేసింది.

జిల్లాలో ఈ తరహా ప్రచారాలు పెరిగినట్టు అధికారులు గుర్తించారు. స్థానికంగా తయారయ్యే అనేక రకాల ఆహార ఉత్పత్తులను ఎంతోమంది పెయిడ్‌ ప్రమోషన్స్‌ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నగర పరిధిలోని అనేకమంది వ్యాపారులు కూడా ఈ తరహా ప్రచారాలపై దృష్టిసారించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి వాటిపై దృష్టి సారిస్తామని ఆహార భద్రత, ప్రమాణాలశాఖ అధికారులు చెబుతున్నారు.

నిబంధనల మేరకు..

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం నిజమైన/ వాస్తవమైన, స్పష్టమైన, అర్థవంతమైన, తప్పుదోవ పట్టించని విధంగా ప్రచారం ఉండాలి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లోగో చూపించి ప్రచారం చేయకూడదు. తప్పుడు సమాచారంతో ప్రకటనలు చేసే వారిపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌యాక్ట్‌-2006, సెక్షన్‌ 53 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అధికారులు దృష్టి సారించాలి

నగర పరిధిలో అనేక ఆహార ఉత్పత్తులకు ఎంతో మంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఊదరగొడుతున్నారు. వాటిపై ఆహార భద్రత ప్రమాణాలశాఖ అధికారులు దృష్టి సారించాలి.

Updated Date - Aug 17 , 2026 | 12:08 AM