Share News

యుద్ధప్రాతిపదికన మాచ్‌ఖండ్‌ పునరుద్ధరణ పనులు

ABN , Publish Date - May 24 , 2026 | 11:22 PM

భారీ అగ్నిప్రమాదంతో నిలిచిపోయిన మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. శనివారం నాటి ప్రమాద సంఘటనపై ఆదివారం సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) కేవీ రాజారావు ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి బృందంతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.

యుద్ధప్రాతిపదికన మాచ్‌ఖండ్‌ పునరుద్ధరణ పనులు
ప్రాజెక్టు అధికారులతో మాట్లాడుతున్న సీలేరు కాంప్లెక్స్‌ సీఈ కేవీ రాజారావు

సీలేరు కాంప్లెక్స్‌ సీఈ కేవీ రాజారావు పరిశీలన

11 కేవీ బ్రేకర్‌ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడి

విశాఖ నుంచి బ్యాక్‌ ఫీడింగ్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా

ముంచంగిపుట్టు, మే 24 (ఆంధ్రజ్యోతి): భారీ అగ్నిప్రమాదంతో నిలిచిపోయిన మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. శనివారం నాటి ప్రమాద సంఘటనపై ఆదివారం సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) కేవీ రాజారావు ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి బృందంతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రమాదం జరిగిన కంట్రోల్‌ రూమ్‌, ఎక్సైటేషన్‌ క్యూబికల్స్‌, 11 కేవీ బ్రేకర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ప్రాజెక్టు అధికారులు, సిబ్బందితో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మొదట 11 కేవీ బ్రేకర్‌ పేలడం వల్లే..

ప్రాజెక్టులో మొదట 11 కేవీ బ్రేకర్‌ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, దాంతో జనరేటర్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయిందని సీఈ కేవీ రాజారావు స్పష్టం చేశారు. మంటలు ఆ తరువాత 5వ నంబరు ఎల్‌ఏబీటీకి వ్యాపించాయని, అక్కడ కూడా పేలుడు సంభవించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అదుపు చేయడం అసాధ్యంగా మారిందని చెప్పారు.

శరవేగంగా మరమ్మతు పనులు

ప్రమాదం తరువాత ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ఇంజనీరింగ్‌ విభాగం శ్రమిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో కాలిపోయిన పాత కేబుల్‌ వైర్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో నూతన కేబుళ్లను వేసే పనులు చేపడుతున్నారు. అలాగే కాలిపోయిన ప్యానెళ్ల వివరాలను సేకరించి, వాటి స్థానంలో నూతన ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఆరు జనరేటర్లకు సంబంధించిన మెకానికల్‌ బేరింగులను నిపుణులు నిశితంగా పరిశీలించి బాగు చేస్తున్నారు. ప్రస్తుతం డుడుమ నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. టీపీ డ్యామ్‌ వద్ద నీటిని సిల్ట్‌ గేట్లను ఎత్తి పూర్తిగా ఖాళీ చేశారు. ప్రాజెక్టు పరిధిలో విద్యుత్‌ ఇబ్బందులు లేకుండా విశాఖ నుంచి బ్యాక్‌ ఫీడింగ్‌ ద్వారా విద్యుత్‌ను దిగుమతి చేసుకొని ప్రస్తుతానికి సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ సీహెచ్‌ అప్పాజీ, సివిల్‌ ఎస్‌ఈ జకీర్‌ హుస్సేన్‌, మోతుగూడెం ఈఈ బాలకృష్ణ, ఈఈ (జనరేషన్‌) బి.గోవిందరాజులు, ఈఈ (సివిల్‌)కురేష్‌ ప్రదాన్‌లు పాల్గొన్నారు.

నేడు ఏపీ జెన్‌కో జల విద్యుత్‌ డైరెక్టర్‌ సందర్శన

మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రాన్ని సోమవారం ఏపీ జెన్‌కో జల విద్యుత్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ తన ప్రత్యేక టెక్నికల్‌ బృందంతో సందర్శించనున్నారు. ప్రాజెక్టులో 11 కేవీ వాక్యూం సర్క్యూట్‌ బ్రేకర్‌ (వీసీబీ)లు పేలిపోవడంతో శనివారం ప్రాజెక్టులో మంటలు చెలరేగి విద్యుదుత్పాదన నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జల విద్యుత్‌ డైరెక్టర్‌ ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు త్వరితగతిన విద్యుదుత్పా దన పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Updated Date - May 24 , 2026 | 11:22 PM