Share News

జలాశయాలు వెలవెల

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:12 AM

నగరంలో నీటి సమస్య మరింత తీవ్రం కానున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

జలాశయాలు వెలవెల

పడిపోతున్న నీటి మట్టాలు

గత ఏడాదిలో పోల్చితే గణనీయంగా తగ్గిన నిల్వలు

వర్షాభావ పరిస్థితులే కారణం

మరో నెల రోజులు ఇదేపరిస్థితి కొనసాగితే ఇబ్బందేనంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో నీటి సమస్య మరింత తీవ్రం కానున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. నగరవాసులకు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో మట్టాలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. మరో నెలరోజులపాటు వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం తాగునీటి ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.

నగర ప్రజల తాగునీటి అవసరాలకు ప్రతిరోజూ 90 మిలియన్‌ గ్యాలన్లు (ఎంజీడీలు) అవసరం. పారిశ్రామిక అవసరాల కోసం మరో 40 ఎంజీడీలు వరకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో అత్యధికం ఏలేరు రిజర్వాయర్‌ నుంచి తర్వాత రైవాడ, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి నగరానికి తీసుకువస్తున్నారు. స్వల్పమొత్తంలో మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్‌తోపాటు గోస్తనీ నదిలో ఇన్‌ఫిల్టరేషన్‌ బావుల నుంచి సేకరిస్తుంటారు. అయితే ఏటా సీజన్‌లో కురిసే వర్షాలకు రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు చేరుతుంది కాబట్టి, ఏడాది పొడవునా నగరవాసులకు, పరిశ్రమలకు, వ్యవసాయ అవసరాలకు సరఫరా చేసేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండడం లేదు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర దాటినా సరైన వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో భూగర్భ జలమట్టాలు భారీగా తగ్గిపోయాయి. అపార్టుమెంట్‌లు, నివాసాల్లో బోర్లు ఎండిపోయాయి. దీంతో ప్రజల సాధారణ అవసరాలకు సైతం జీవీఎంసీ సరఫరా చేసే కొళాయి నీటిపైనే ఆధారపడుతున్నారు.

మరోవైపు వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి కొత్తగా నీరు చేరలేదు. ఉన్న నీటినే ప్రస్తుతం తాగునీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున వ్యవసాయ అవసరాలకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల రిజర్వాయర్లలో మట్టాలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాది జూలై 23వ తేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం 77.15 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 74.58 మీటర్లు ఉంది. అలాగే తాటిపూడి రిజర్వాయర్‌లో గత ఏడాది 291 అడుగులు ఉండగా, ప్రస్తుతం 286.5 అడుగులు, రైవాడ రిజర్వాయర్‌లో 111.58 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 106.9 మీటర్లు ఉంది. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో గత ఏడాది ఇదే సమయానికి 49.9 అడుగులు ఉండగా, ప్రస్తుతం 49.9 అడుగులు ఉంది. ముడసర్లోవ రిజర్వాయర్‌లో 158.03 ఉండగా, ప్రస్తుతం 155.04 అడుగులు ఉంది. గత ఏడాది గంభీరం రిజర్వాయర్‌లో 120 అడుగులు ఉండగా, ప్రస్తుతం 120 అడుగులు ఉంది. గోస్తనీ నదిలో ఫిల్టరేషన్‌ బావుల్లో గత ఏడాది జూలై 23వ తేదీ నాటికి 28 అడుగులు ఉండగా ప్రస్తుతం 25.5 అడుగులు ఉంది.

గత రెండు రోజుల్లోనే రిజర్వాయర్లలో నీటి మట్టాలు గతంలో ఎన్నడూలేనంతగా శరవేగంగా తగ్గడం విశేషం. ఇదే పరిస్థితి మరో నెలరోజులు కొనసాగితే మాత్రం ఏలేరు, రైవాడ, తాటిపూడి వంటి ప్రధాన రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకుంటాయని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరితే నగరంలో తాగునీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

రిజర్వాయర్లలో ప్రస్తుత నీటిమట్టం

రిజర్వాయర్‌ గరిష్ఠం కనిష్ఠం గత ఏడాది ప్రస్తుతం

జూలై 23 నాటికి

ఏలేరు 86.56మీటర్లు 71.5 మీటర్లు 77.15 మీటర్లు 74.9

రైవాడ 114 మీటర్లు 99 మీటర్లు 111.58 మీటర్లు 106.9

మేహద్రిగెడ్డ 61 అడుగులు 44 అడుగులు 49.9 అడుగులు 49.9

తాటిపూడి 297 అడుగులు 251 అడుగులు 291 అడుగులు 286.5

ముడసర్లోవ 169 అడుగులు 152 అడుగులు 158.03 అడుగులు 155.04

గంభీరం 126 అడుగులు 117 అడుగులు 120.09 అడుగులు 120.09

గోస్తనీ 35 అడుగులు 21.6 28అడుగులు 25.3

-------------------------------------------

Updated Date - Jul 26 , 2026 | 01:12 AM