Share News

జలాశయాలు వెలవెల

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:06 AM

జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు నిరాశాజనకంగా వున్నాయి. ఒక్క తాండవ రిజర్వాయర్‌ మినహా మిగిలిన అన్ని జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటిమట్టాలు ఐదు మీటర్ల వరకు తక్కువ వున్నాయి. దాదాపు ఏడు నెలల నుంచి పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు పడకపోవడంతో జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆయకట్టుకు నీటి సరఫరా, తరువాత మండిన ఎండల కారణంగా నీరు ఆవిరికావడంతో జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోయాయి.

జలాశయాలు వెలవెల
106 మీటర్లకు పడిపోయిన రైవాడ జలాశయం నీటి మట్టం

నిరాశాజనకంగా నీటి నిల్వలు

పూర్తిగా అడుగంటిన కోనాం రిజర్వాయర్‌

గత ఏడాదితో పోలిస్తే రైవాడలో ఐదు మీటర్లు తక్కువ

పెద్దేరులో రెండు మీటర్లు.. స్థిరంగా కల్యాణపులోవ

(ఆంధ్రజ్యోతి- దేవరాపల్లి/ మాడుగుల రూరల్‌,/ చీడికాడ/ రావికమతం)

జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు నిరాశాజనకంగా వున్నాయి. ఒక్క తాండవ రిజర్వాయర్‌ మినహా మిగిలిన అన్ని జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటిమట్టాలు ఐదు మీటర్ల వరకు తక్కువ వున్నాయి. దాదాపు ఏడు నెలల నుంచి పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు పడకపోవడంతో జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆయకట్టుకు నీటి సరఫరా, తరువాత మండిన ఎండల కారణంగా నీరు ఆవిరికావడంతో జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోయాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు వచ్చి సుమారు రెండు వారాలు అవుతున్నప్పటికీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు చివరి నుంచి వర్షాలు తగ్గే సూచనలు వున్నాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖరీఫ్‌లో స్వల్ప కాలిక వరి వంగడాలను సాగు చేయాలని, అదే విధంగా ఆయకట్టుకు కొంత ముందుగానే నీటిని విడుదల చేయాలని వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులను ఆదేశించింది. కానీ జిల్లాలో తాండవ మినహా మిగిలిన జలాశయాల్లో నీటి నిల్వలు అంత ఆశాజనకంగా లేవు. గత ఏడాది ఇదే సమయానికి వున్న నీటి నిల్వలతోపోలిస్తే ఐదు మీటర్ల వరకు తక్కువ వున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, రిజర్వాయర్లలోకి సమృద్ధిగా వరద నీరు చేరితే వచ్చే నెల చివరి నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా వుండడంతో వరి ఆకుమడులు పోసే విషయంలో రైతులు ముందు, వెనుక ఆలోచిస్తున్నారు.

రైవాడలో ఐదు మీటర్లు తక్కువ..

దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయ నీటి మట్టం గత ఏడాదితో పోలిస్తే ఐదు మీటర్ల మేర తక్కువ వుంది. ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో ఎక్కువ రోజులు దేవరాపల్లి మండలంలో జిల్లాస్థాయిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పరివాహక ప్రాంతమైన ఏజెన్సీలో గత ఏడాది నవంబరు మధ్య నుంచి దాదాపు వర్షాలు కురవలేదు. అటు అధిక వేడి, ఇటు వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో నామమాత్రంగా వుంది. ఫలితంగా జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పడిపోయాయి. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా గురువారం సాయంత్రం 106 మీటర్లు వుంది. గత ఏడాది ఇదే రోజున నీటి మట్టం 111 మీటర్లు వుంది. రిజర్వాయర్‌ కింద సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు వుంది. అయితే ఖరీఫ్‌కు నీటి సమస్య వుండదని ప్రాజెక్టు డీఈఈ సత్యంనాయుడు చెబుతున్నారు. పరివాహక ప్రాంతమైన అల్లూరి జిల్లాలో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయని, ఎప్పటి మాదిరిగానే రైతుల అవసరాల మేరకు జూలై చివరి వారంలో కాలువలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు.

పెద్దేరులో రెండు మీటర్లు...

మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలో ఎప్పుడూ నీటి నిల్వలు సమృద్ధిగానే వుంటాయి. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి వర్షాలు అంతగా కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నీటి నిల్వలు ఒకింత తక్కువగానే వున్నాయి. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లుకాగా గురువారం సాయంత్రం 133.5 మీటర్ల నీరు వుంది. గత ఏడాది ఇదే సమయంలో నీటిమట్టం 135.85 మీటర్లు వుంది. ఈ జలాయశం కింద మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు వుంది. గత ఏడాది జూలై 27వ తేదీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. రానున్న రెండు, మూడు వారాల్లో పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి, జలాశయంలోకి సమృద్ధిగా వరద నీరు చేరితే ఎప్పటి మాదిరిగానే జూలై చివరి వారంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని డీఈఈ చిన్నంనాయుడు తెలిపారు.

అడుగంటిన కోనాం..

చీడికాడ మండలం కోనాం జలాశయం పూర్తిగా అడుగంటింది. రెండు నెలల క్రితం స్పిల్‌ గేట్ల మరమ్మతుల కోసం నీటిని దిగువకు విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లు. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీలో వుంది. గత ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం 95.7 మీటర్లు ఉంది. జూలైలో వర్షాలు బాగా కురిసి, రిజర్వాయర్‌లో సమృద్ధిగా నీరు చేరితే ఆగస్టు మొదటి వారంలో కాలువలకు నీటిని విడుదల చేస్తామని ఏఈఈ సత్యనారాయణదొర తెలిపారు.

కల్యాణపులోవలో..

రావికమతం మండలం కల్యాణపులోవ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు స్థిరంగా వున్నాయి. గరిష్ఠ నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 450.08 అడుగులు వుంది. గత ఏడాది ఇదే రోజున 450.09 అడుగులు వుంది. డెడ్‌ స్టోరేజీ 422 అడుగులు. కల్యాణపులోవ రిజర్వాయర్‌ కింద సుమారు నాలుగున్నర వేల ఎకరాల ఆయకట్టు వుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో వున్న నీరు సుమారు నెల రోజులపాటు ఆయకట్టుకు సరఫరా చేయవచ్చని, జూలైలో వర్షాలు బాగా కురిస్తే ఖరీఫ్‌కు ఇబ్బంది వుండదని ఏఈ డి.సూర్య చెప్పారు.

Updated Date - Jun 26 , 2026 | 12:06 AM