రిజర్వాయర్లు కళకళ
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:12 AM
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవనుకుంటున్న తరుణంలో గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చి చేరిన వరద నీరు
నిండుగా కనిపిస్తున్న జోలాపుట్టు, బలమెల, గుంటవాడ, డొంకరాయి జలాశయాలు
సీలేరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవనుకుంటున్న తరుణంలో గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి.
జోలాపుట్టు రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 2,750 అడుగులు కాగా, గత నెల 22న 2,715.80 అడుగులు ఉంది. అయితే ఆ తరువాత తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. సోమవారానికి 2,746.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌కు 1,574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జోలాపుట్టు రిజర్వాయర్ దిగువన బలిమెల రిజర్వాయర్ ఉంది. ఇక్కడ 1,516 అడుగుల నీరు నిల్వ చేయవచ్చు. గత నెల 22న ఈ రిజర్వాయర్‌లో 1,455.60 అడుగుల నీరుండగా, సోమవారం నాటికి 1,504 అడుగులకు చేరింది. ప్రస్తుతం 6,145 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. బలిమెల దిగువన గుంటవాడ రిజర్వాయర్ ఉంది. ఇక్కడ 1,360 అడుగుల నీరు నిల్వ చేయవచ్చు. గత నెల 22 నాటికి 1,341.70 అడుగుల నీరుంది. భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో సీలేరు మెయిన్ డ్యాం రెండు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు రెండు రోజుల పాటు విడుదల చేశారు. సోమవారం నాటికి ఇక్కడ 1,348.60 అడుగుల నీరుంది. ప్రస్తుతం 326 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది. సీలేరు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు డొంకరాయి జలాశయానికి చేరుతుంది. ఇక్కడ 1,037 అడుగుల నీరు నిల్వ చేయవచ్చు. ఈ జలాశయానికి నదీ పరీవాహక ప్రాంతాలుగా ఉన్న వలసగెడ్డ, పాలగెడ్డలు నిరంతరం పారుతూనే ఉంటాయి. వరదల కారణంగా ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నెల 22 నాటికి 1,028.50 అడుగుల నీరుండగా, భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో 4 గేట్లు ఎత్తి లక్షా 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఏవీపీ డ్యామ్ గేట్లు ఎత్తి మరికొంత నీటిని విడుదల చేశారు. సోమవారం డొంకరాయి జలాశయంలో 1,036.10 అడుగుల నీరుంది. ప్రస్తుతం ఈ జలాశయానికి 5,340 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు ఫోర్‌బే జలాశయానికి చేరుకుంటుంది. ఇక్కడ 930 అడుగులు నీటిని నిల్వ చేయవచ్చు. ఇక్కడ నుంచి పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీటినిపంపి విద్యుదుత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఫోర్‌బే జలాశయంలో 919.30 అడుగుల నీరుంది. సోమవారం నాటికి 3,988 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జలాశయానికి వస్తుంది. ఈ ఏడాదికి విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకాలు ఉండవని, నీరు సరిపోవచ్చని జెన్‌కో అధికారులు తెలిపారు.