Share News

నిండుకుండలా రిజర్వాయర్లు

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:23 PM

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీలేరు నదిపై నిర్మించిన ఐదు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో జల విద్యుత్‌ ఉత్పత్తికి ఏడాది పొడవునా నీటి సమస్య ఉండదు.

నిండుకుండలా రిజర్వాయర్లు
నిండుకుండలా ఉన్న బలిమెల రిజర్వాయర్‌ 9ఎస్‌ఎల్‌ఆర్‌3 డొంకరాయి రిజర్వాయర్‌

నీటి సమస్య లేకపోవడంతో ఏడాది పొడవునా విద్యుదుత్పత్తి

సీలేరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీలేరు నదిపై నిర్మించిన ఐదు రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో జల విద్యుత్‌ ఉత్పత్తికి ఏడాది పొడవునా నీటి సమస్య ఉండదు.

వాస్తవానికి ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జల విద్యుత్‌ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉందని జన్‌కో అధికారులు ఆందోళన చెందారు. అయితే తాజాగా రెండు తుఫాన్లు రావడంతో భారీ వర్షాలు కురిసి వరదనీరు పోటెత్తింది. ఆర్నబ్‌, మురసు తుఫాన్లకు సీలేరు నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీని వల్ల సీలేరు నదిపై నిర్మించిన జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి, ఫోర్‌బే రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. ఇటీవల ఐదు రిజర్వాయర్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. జోలాపుట్టు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, సోమవారానికి 2,745.90 అడుగులకు చేరింది. బలిమెల రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు కాగా, ప్రస్తుతం 1,508.20 అడుగులకు చేరింది. గుంటవాడ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,360 అడుగులు కాగా, 1,338.70 అడుగులకు చేరింది. గుంటవాడ రిజర్వాయర్‌ వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు కాపర్‌డ్యామ్‌ నిర్మాణ పనుల కారణంగా గుంటవాడ రిజర్వాయర్‌లో నీటిమట్టాలు 1,338.80 అడుగుల వద్ద స్థిరంగా ఉంచుతూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. డొంకరాయి రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, ఇప్పుడు 1,029.30 అడుగులకు చేరింది. ఫోర్‌బే రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 930 అడుగులు కాగా, ఇప్పుడు 918.30 అడుగులకు చేరింది. ఈ నీటి సంవత్సరం జల విద్యుత్‌ కేంద్రాలకు ఎటువంటి నీటి సమస్య లేకుండా విద్యుదుత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి.

Updated Date - Nov 09 , 2026 | 11:23 PM