Share News

నిండుకుండలా జలాశయాలు

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:58 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.

నిండుకుండలా జలాశయాలు
డుడుమ జలాశయం నుంచి బలిమెలకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

ప్రమాదస్థాయికి చేరుకోకుండా ముందస్తు చర్యలు

జోలాపుట్టు, బలిమెల, గుంటవాడ, డొంకరాయి నుంచి భారీగా నీరు విడుదల

సీలేరు/ముంచంగిపుట్టు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జలాశయాల నీటిమట్టాలు గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా జోలాపుట్టు డ్యామ్‌ నుంచి 20 వేల క్యూసెక్కులు, డుడుమ డ్యామ్‌ నుంచి 14 వేల క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. బలిమెల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1,516 అడుగులు కాగా, ప్రస్తుతం 1,510.5 అడుగులకు చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున బలిమెల జలాశయం నుంచి 34 వేల క్యూసెక్కుల నీటిని గుంటవాడ జలాశయంలోకి విడుదల చేశారు. అయితే గుంటవాడ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,360 అడుగులు కాగా, పంప్డ్‌ స్టోరేజీ కాపర్‌ డ్యామ్‌ పనుల నేపథ్యంలో ఇక్కడ 1,338.5 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలన్న జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఇక్కడ నీటిమట్టం పెరగకుండా బలిమెల నుంచి వస్తున్న నీటిని గుంటవాడ మెయిన్‌ డ్యామ్‌ ద్వారా 26 వేల క్యూసెక్కులు, సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 8 వేల క్యూసెక్కులు కలిపి మొత్తం 34 వేల క్యూసెక్కుల నీటిని సీలేరు నుంచి డొంకరాయికి విడుదల చేస్తున్నారు. డొంకరాయి పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, సీలేరు, ఇతర వాగుల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండంతో 1,028.50 అడుగుల నీటిమట్టం స్థిరంగా కొనసాగించాలన్న ఆదేశాలతో 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 4,300 క్యూసెక్కుల నీటిని పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి విడుదల చేస్తున్నారు. సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టేంత వరకు జలాశయాలు ప్రమాదస్థాయికి చేరకుండా నీటి విడుదలను కొనసాగిస్తామని సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జాకీర్‌ హుస్సేన్‌ సోమవారం తెలిపారు.

సరిహద్దు వంతెనపై రాకపోకలు బంద్‌

జోలాపుట్టు జలాశయం నుంచి వరదనీరు అధికంగా విడుదల చేస్తున్న తరుణంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు వంతెన ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఆ వంతెన పైనుంచి ప్రస్తుతం రాకపోకలను ఇరురాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఎస్‌ఐ పి.నాని తెలిపారు. జలాశయం నుంచి విడుదల చేస్తున్న వరదనీరు వంతెన కింది భాగానికి తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో వంతెనకు రెండువైపులా అడ్డంగా కర్రలను కట్టారు. వరదనీటి ఉధృతి తగ్గేవరకు అటుగా ఎవరూ వెళ్లకూడదని ఎస్‌ సూచించారు.

Updated Date - Nov 03 , 2026 | 12:58 AM