రిజర్వాయర్లకు కొనసాగుతున్న వరద
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:39 AM
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వర్షం పడడడం ఆగిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ రిజర్వాయర్లలోకి వరద నీటి ప్రవాహనం కొనసాగుతున్నది.
ఆయకట్టుకు నీటి విడుదలను ఆపేసిన అధికారులు
105.75 మీటర్లకు చేరిన రైవాడ నీటిమట్టం
కోనాంకు 400, పెద్దేరుకు 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. వర్షం పడడడం ఆగిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ రిజర్వాయర్లలోకి వరద నీటి ప్రవాహనం కొనసాగుతున్నది. దీంతో నీటి నిల్వలు సమృద్ధిగా పెరిగాయి. మరోవైపు వర్షాల కారణంగా పొలాల్లో నీరు చేరడంతో మరికొద్ది రోజులపాటు ఆయకట్టుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదని, దీంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశాజనకంగా వుంటాయని అధికారులు చెబుతున్నారు.
రైవాడలోకి 500 క్యూసెక్కుల వరద
దేవరాపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) మండలంలోని రైవాడ జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా ఆదివారం 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 105.75 మీటర్లకు చేరింది. భారీ వర్షాల కారణంగా కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను ఆపేశామని, జీవీఎంసీ తాగునీటి అవసరాల కోసం 50 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామని జలాశయం డీఈఈ సత్యంనాయుడు తెలిపారు.
134.6 మీటర్లకు చేరిన పెద్దేరు నీటిమట్టం
మాడుగుల రూరల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దేరు జలాశయంలోని వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లుకాగా 200 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండడంతో ఆదివారం 134.6 మీటర్లకు చేరింది. పొలాల్లో వర్షం నీరు నిలిచి వుండడంతో కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడదల చేయడం లేదని అధికారులు తెలిపారు.
నేడు 20క్యూసెక్కులు హెచ్‌ఎల్‌సీ ద్వారా విడుదల
చీడికాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనాం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇటీవల వర్షాలు కురవడం మొదలైనప్పటికీ నుంచి ఇంతవరకు నాలుగున్నర మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లుకాగా ఆదివారం సుమారు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 95.6 మీటర్లకు చేరింది. గత ఆదివారం నీటిమట్టం 91 మీటర్లు మాత్రమే వుంది. హైలెవెల్ ఛానల్ రైతుల కోరిక మేరకు సోమవారం నుంచి కాలువకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఏఈ సత్యనారాయణ దొర తెలిపారు.
స్వల్పంగా పెరిగిన కల్యాణపులోవ నీటి మట్టం
రావికమతం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్యాణపులోవ రిజర్వాయర్‌లోకి వరద నీరు అనుకున్నంత ఆశాజనకంగా చేరలేదు. పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా, వర్షాలు ప్రారంభం కావడానికి ముందు 438 అడుగులు వుంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 50 క్యూసెక్కులు మాత్రమే వుంది. దీంతో ఆదివారం నీటిమట్టం 439 అడుగులు వుందని ఏఈ డి.సూర్య తెలిపారు. వర్షాల వల్ల పొలాలకు నీటి అవసరం లేకపోవడంతో కాలువలకు నీటిని విడుదల విడుదల చేయడం లేదని ఆయన చెప్పారు.