ప్రమాదస్థాయిలో జలాశయాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:34 AM
ఆర్నబ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించి జలాశయాలకు వరదనీటి ఇన్‌ఫ్లో పెరిగింది.
జోలాపుట్టు నుంచి 15 వేలు, డుడుమ నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు విడుదల
ముంచంగిపుట్టు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించి జలాశయాలకు వరదనీటి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరాయి. ముందస్తు చర్యల్లో భాగంగా రెండు జలాశయాల నుంచి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, బుధవారం 2,748.15 అడుగులకు చేరింది. దీంతో ప్రధాన జలాశయం రెండు గేట్లు, ఈ జలాశయానికి ఆనుకొని ఉన్న స్పిల్‌వే డ్యామ్ మూడు గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల డుడుమకు విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,580.40 అడుగులకు చేరింది. ఈ జలాశయం రెండు గేట్లను ఎత్తి ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో గల బలిమెలకు 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు జలాశయాలకు వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగిందని, రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.