పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:58 AM
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించి రిజరేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు పదవుల్లో మహిళలకు ఇంచుమించుగా సగం కేటాయించారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో 37.46 శాతం, వార్డు పదవుల్లో 36.45 శాతం రిజర్వు చేశారు.
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్
మొత్తం పంచాయతీలు: 646
ఎస్టీలకు 20, ఎస్సీలకు 58, బీసీలకు 242, అన్రిజర్వుడ్లో 326 సర్పంచ్ పదవులు
మొత్తం వార్డులు: 6,294
ఎస్టీలకు 172, ఎస్సీలకు 518, బీసీలకు 2,294, అన్‌రిజర్వుడ్ 3,310
అన్నింటిలోనూ మహిళలకు ఇంచుమించు సగం స్థానాలు రిజర్వు
అనకాపల్లి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు సంబంధించి రిజరేషన్లను ఖరారు చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని పదవులకు రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు పదవుల్లో మహిళలకు ఇంచుమించుగా సగం కేటాయించారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో 37.46 శాతం, వార్డు పదవుల్లో 36.45 శాతం రిజర్వు చేశారు.
అనకాపల్లి జిల్లాలో మొత్తం 646 గ్రామ పంచాయతీలు వున్నాయి. రాంబిల్లి మండలంలోని పంచదార్ల, అప్పారాయుడుపాలెం, జడ్.చింతువ, ఎం.చింతువ పంచాయతీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ప్రస్తుతం 642 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిజర్వేషన్లను మొత్తం 646 పంచాయతీలను పరిగణనలోకి తీసుకొని ఖరారు చేశారు. మొత్తం సర్పంచ్ పదవుల్లో 318 స్థానాలను (49.23 శాతం) మహిళలకు రిజర్వు చేశారు. షెడ్యూల్డు కులాల వారికి 20 సర్పంచ్ స్థానాలు కేటాయించగా వీటిలో ఏడింటిని మహిళలకు రిజర్వు చేశారు. ఎస్సీలకు 58 సర్పంచ్ స్థానాలు కేటాయించగా వీటిలో 23 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు 242 సర్పంచ్ స్థానాలు కేటాయించగా.. వీటిలో 120 పదవులను మహిళలకు రిజర్వు చేశారు. అన్రిజర్వుడ్లో 326 పంచాయతీ సర్పంచ్ పదవులు వుండగా, వీటిలో 168 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. అన్‌రిజర్వుడ్ మినహా మిగిలిన స్థానాల్లో ఆయా కేటగిరీలకు చెందిన వారే పోటీ చేయాల్సి వుంటుంది. అన్ రిజర్వుడ్ జనరల్ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. అదే విధంగా అన్‌రిజర్వుడ్ స్థానాల్లో మహిళలకు కేటాయించిన వాటిల్లో అన్ని వర్గాల మహిళలు పోటీ చేయడానికి అర్హులు.
వార్డుల్లో రిజర్వేషన్లు..
జిల్లాలో ఎన్నికలు జరగనున్న 642 పంచాయతీల్లో 6,294 వార్డులు వున్నాయి. వీటిలో మహిళలకు 3,142 వార్డులను (49.92 శాతం) కేటాయించారు. ఎస్టీలకు 172 వార్డులు కేటాయించగా వాటిలో మహిళలకు 65 వార్డులను రిజర్వు చేశారు. ఎస్సీలకు 518 వార్డులు కేటాయించగా, వీటిలో మహిళలకు 134 వార్డులు, బీసీలకు 2,294 వార్డులు కేటాయించగా, వీటిలో మహిళలకు 1,205 వార్డులను రిజర్వు చేశారు. అన్రిజర్వుడ్లో 3,310 వార్డులు వుండగా, వీటిల్లో మహిళలకు 1,738 వార్డులు కేటాయించారు.
మూడు దశల్లో ఎన్నికలు
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి. మొదటి దశకు నవంబరు 13న, రెండో దశకు అదే నెల 16, మూడో దశకు 19న నోటిఫికేషన్లు జారీ అవుతాయి. మొదటి దశ పోలింగ్ నవంబరు 26న అనకాపల్లి డివిజన్లోని 10 మండలాల్లో, రెండో దశ పోలింగ్ నవంబరు 29న నర్సీపట్నం డివిజన్లోని ఏడు మండలాల్లో, మూడో దశ పోలింగ్ డిసెంబరు 2న అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లోని ఏడు మండలాల్లో జరుగుతాయి. అన్ని విడతల్లోనూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.