లిచీపై పరిశోధనలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:42 AM
స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌యూ)లో మేలిరకం లిచీ పండ్ల మొక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు.
బిహార్ నుంచి నాలుగు రకాల మొక్కల దిగుమతి
హెచ్‌ఆర్‌యూలో ప్రయోగాత్మక సాగు
గిరిజన ప్రాంతానికి లిచీ సాగు అనుకూలమని నిర్ధారణ
చింతపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌యూ)లో మేలిరకం లిచీ పండ్ల మొక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. తొమ్మిదేళ్ల క్రితం ఉద్యాన పరిశోధన స్థానంలో లిచీపై పరిశోధనలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు గిరిజన ప్రాంతం లిచీ సాగుకు అత్యంత అనుకూలమని నిర్ధారించారు. తొలి దశ పరిశోధనల్లో సాగు చేపట్టిన లిచీ మొక్కల దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో మేలిరకాలను గిరిజన రైతులకు అందజేసేందుకు పరిశోధనలు విస్తృతం చేశారు. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతంలో లిచీ సాగును విస్తరింపజేయాలనే లక్ష్యంతో బిహార్ లిచీ పరిశోధన స్థానం నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు రకాల మేలిరకం మొక్కలపై స్థానిక పరిశోధన స్థానంలో ప్రయోగాత్మక సాగును శాస్త్రవేత్తలు ప్రారంభించారు.
గిరిజన ప్రాంత రైతులకు లిచీ పంటను పరిచయం చేసేందుకు అనుకూల పరిస్థితులపై అధ్యయనం చేయాలని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నాటి టీడీపీ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం అధికారుల సూచనల మేరకు 2016లో చింతపల్లి శాస్త్రవేత్తలు బిహార్ ముజాప్ఫర్పూర్ జాతీయ పరిశోధన కేంద్రం(ఎన్‌ఆర్‌సీ) నుంచి కొన్ని రకాల మొక్కలను దిగుమతి చేసుకుని ఉద్యాన పరిశోధన స్థానంలో నాట్లు వేశారు. ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాత్మక లిచీ సాగు మంచి ఫలితాలనిచ్చింది. 2016 నుంచి 2021 వరకు మొక్కల ఎదుగుదల, మొక్కలను ఆశించే చీడపీడలపై పరిశోధనలు జరిపారు. ప్రారంభం నుంచి మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా వున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగాత్మక సాగులో మొక్కలకు పెద్దగా చీడపీడలు ఆశించలేదు. 2022 నుంచి లిచీ మొక్కల నుంచి దిగుబడులు ప్రారంభమయ్యాయి. 2023 వరకు ఓ మాదిరిగా దిగుబడులు వచ్చాయి. 2024, 2025 దిగుబడులు గణనీయంగా పెరిగాయి.
నాణ్యమైన దిగుబడులు
శాస్త్రవేత్తలు చేపట్టిన తొలిదశ ప్రయోగాత్మక లిచీ సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించారు. లిచీ పండ్లు ఆకర్షణీయమైన గులాబీ ఎరుపు వర్ణంలో ఉంటున్నాయి. పండ్ల పరిమాణం బాగుంది. పండ్లు తీపి, పులుపు రుచుల్లో ఉన్నాయి. పండ్ల రుచిలో తీపి శాతం అధికంగా ఉంటుంది. మొక్క కొమ్మల్లో గుత్తులుగా లిచీ పండ్ల దిగుబడులు వస్తున్నాయి. ఈ లిచీ పండ్లలోనూ మంచి పోషక విలువలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్కొక్క మొక్క నుంచి 35 కిలోల లిచీ పండ్ల దిగుబడి వచ్చింది. పదో ఏడాది నుంచి దిగుబడులు గణనీయంగా పెరగనున్నాయి. వందేళ్ల వరకు ఈ మొక్కలు పండ్ల దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మేలిరకాలపై పరిశోధనలు
గిరిజన ప్రాంతానికి అనువైన మేలిరకం లిచీ మొక్కలను ఎంపిక చేసేందుకు బిహార్ ముజాప్ఫర్పూర్ జాతీయ లిచీ పరిశోధన స్థానం నుంచి నాలుగు రకాల మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టు పండ్ల పథకంలో భాగంగా సంప్రదాయేతర ప్రాంతమైన గిరిజన ప్రాంతంలో లిచీపై పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించాయి. ఈ మేరకు దిగుబడి, నాణ్యత, రంగు, రుచి ఆధారంగా చైనా, సాహి, బెదాన, గండకిలావిమా రకాలను దిగుమతి చేసుకున్నారు. ఈ నాలుగు రకాల మొక్కలను పరిశోధన స్థానంలో నాట్లు వేశారు.
15 ఏళ్లపాటు అధ్యయనం
పరిశోధన స్థానంలో నాట్లువేసిన నాలుగు రకాల మొక్కలపై 15 ఏళ్లపాటు పరిశోధనలు నిర్వహించనున్నారు. నాట్లు వేసిన మూడో ఏడాది నుంచి దిగుబడులు ప్రారంభమవుతాయి. ప్రతి ఏడాది వివిధ దశల్లో లిచీ మొక్కలపై పరిశోధనలు చేస్తారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు లిచీ సాగు చేస్తున్నప్పటికి ఏ రకమనే స్పష్టత లేదు. పండ్లు కోత దశకు ముందు పగిలిపోతున్నాయి. పరిశోధన స్థానంలో సాగు ప్రారంభించిన నాలుగు రకాల మొక్కలు తెగుళ్లను ఏ విధంగా తట్టుకుంటున్నాయి?, ప్రాంతీయ వాతావరణం ఏ విధంగా సహకరిస్తుంది అనే కోణంలో అధ్యయనం చేస్తారు. ప్రధానంగా రంగు, రుచి, నాణ్యత, దిగుబడి ఆధారంగా మేలిరకం మొక్కలను ఎంపిక చేసి రైతులకు సిఫారసు చేస్తారు.