మొక్కజొన్న పంటపై పరిశోధనలు
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:31 AM
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో చెరకుతో పాటు మొక్కజొన్న పంటపై కూడా పరిశోధనలు చేపడతామని ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరకు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం, మొక్కజొన్న విస్తీర్ణం పెరగడంతో మొక్కజొన్నపై పరిశోధనలకు ప్రాధాన్యం సంతరించుకుందన్నారు.
- ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు
అనకాపల్లి అగ్రికల్చర్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో చెరకుతో పాటు మొక్కజొన్న పంటపై కూడా పరిశోధనలు చేపడతామని ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరకు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం, మొక్కజొన్న విస్తీర్ణం పెరగడంతో మొక్కజొన్నపై పరిశోధనలకు ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ప్రస్తుతం పెద్దాపురంలో మొక్కజొన్నపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. తగ్గిన చెరకు విస్తీర్ణం స్థానంలో మొక్కజొన్న విస్తీర్ణం చాలా చోట్ల పెరుగుతోందన్నారు. ఉత్తరాంధ్రలో 62 వేల ఎకరాల నుంచి 80 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగులో ఉందని, 1,80,000 టన్నుల మొక్కజొన్న పండుతోందని వివరించారు. ఒకప్పుడు 50 వేల ఎకరాల్లో సాగయ్యే చెరకు ప్రస్తుతం 15 నుంచి 18 వేల ఎకరాలకు పడిపోయిందని అంచనా వేసినట్టు చెప్పారు. మొక్కజొన్నలో ఎదురవుతున్న సమస్యలు, మంచి విత్తనం, చీడపీడల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు జరుపుతామని ఆయన తెలిపారు.