కుంకుమ పువ్వుపై పరిశోధనలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:24 PM
ఉత్తరాదికి పరిమితమైన కుంకుమపువ్వుపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో పరిశోధనలు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారుల సహకారంతో రబీలో ప్రయోగాత్మక సాగును చేపట్టనున్నారు. ఐదేళ్లపాటు అనేక అంశాల్లో పరిశోధనలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాణ్యజ్య పంటగా పరిచయం చేసేందుకు కుంకుమపువ్వు ప్రాజెక్టుని జిల్లాకు మంజూరు చేసింది.
ప్రణాళికలు సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు
జిల్లాకు కుంకుమ సాగు ప్రాజెక్టు మంజూరు
రబీలో సాగుకు కార్యాచరణ
చింతపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉత్తర భారతదేశాన్ని పోలిన విభిన్న వాతావరణం కలిగి ఉంటుంది. ఆంధ్రకశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో శీతాకాలంలో ఒకటి, రెండు, సున్న, మైనస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. లంబసింగికి సమానమైన వాతావరణం చింతపల్లిలోనూ ఉండడంతో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 2022లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్(ఏడీఆర్) డాక్టర్ ఎం. సురేశ్ కుమార్ పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు కుంకుమపువ్వు ప్రయోగాత్మక సాగు చేపట్టారు. పరిశోధన స్థానంలో పర్పుల్ స్ర్పింగ్స్ సంస్థ ప్రతినిధుల సాంకేతిక సహకారంతో 2023 వరకు పరిశోధనలు నిర్వహించారు. విశాఖ ఏజెన్సీ కుంకుమపువ్వు సాగుకు అనుకూలమని నిర్ధారించారు.
రబీలో ప్రయోగాత్మక సాగు ప్రారంభం
స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఈఏడాది రబీలో కుంకుమపువ్వు ప్రయోగాత్మక సాగును ప్రారంభించనున్నారు. కుంకుమపువ్వు ప్రయోగాత్మక సాగుపై శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రతిపాదనలను వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు ఆమోదించారు. కుంకుమపువ్వు సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు శాస్త్రవేత్తలు షేడ్ నెట్, ఓపెన్ ఫీల్డ్‌లో ప్రయోగాత్మక సాగు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తొలిసారిగా 40 ఎకరాల్లో సాగు
రాష్ట్ర ప్రభుత్వం లంబసింగికి కుంకుమపువ్వు ప్రాజెక్టుని మంజూరు చేసింది. ఈమేరకు ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో తొలిసారిగా 40 ఎకరాల్లో కుంకుమపువ్వు సాగుకు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కుంకుమపువ్వు సాగుకి చెరువురు, డైరీనగర్‌కి సమీపంలోనున్న ఏపీ ఫారెస్టు మెడిషనల్ ప్లాంటేషన్ భూములను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటిని ఎంపిక చేసి అభ్యుదయ రైతులతో కుంకుమపువ్వును ఓపెన్ ఫీల్డ్‌లో సాగు చేయించనున్నారు. నాట్లు వేసిన నాటి నుంచి జిల్లా అధికారులు, ఉద్యాన శాఖ అధికారుల పర్యవేక్షణలో శాస్త్రవేత్తల సహకారంతో సాగు చేపట్టనున్నారు. ఈప్రయోగాత్మక సాగు విజయవంతమైతే వాణిజ్య సరళిలో లంబసింగి, చింతపల్లి పరిసర గ్రామాల్లో గిరిజన రైతులతో ప్రభుత్వం కుంకుమపువ్వు సాగును విస్తరించనున్నది.