గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:32 PM
జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర వేడుకలను ఈనెల 26న ఘనంగా నిర్వహించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ సూచించారు.
ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ
దేశభక్తి, గిరిజన ఆచార,
సంప్రదాయాలు ప్రతిబింబించాలి
పాడేరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర వేడుకలను ఈనెల 26న ఘనంగా నిర్వహించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో గణతంత్ర వేడుకలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గణతంత్ర వేడుకలు నిర్వహించే పాడేరు తలారిసింగి ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణను సుందరంగా తీర్చిదద్దడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. దేశభక్తి, గిరిజన ఆచార, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థుల ప్రదర్శనలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు, శకటాల ప్రదర్శనలకు ఏర్పాట్లు చేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల వారసులకు, ఉత్తమ సర్పంచులు, ఉత్తమ రైతులు, ఉత్తమ విద్యార్థులకు సత్కరించడం, జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, అధికారులు పాల్గొన్నారు.