Share News

ఎస్‌వీఎస్‌ కెమికల్స్‌ ప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:04 AM

మండలంలోని లాలంకోడూరు సమీపంలో ఎస్‌వీఎస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం నాన్‌ సెజ్‌లో లాలంకోడూరు సమీపంలో వున్న ఎస్‌వీఎస్‌ రసాయన పరిశ్రమలో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ఎస్‌వీఎస్‌ కెమికల్స్‌ ప్రమాదంపై   రెండు రోజుల్లో నివేదిక
ఎస్‌వీఎస్‌ రసాయన పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడుతున్న హోం మంత్రి అనిత. పక్కన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌

అధికారులకు మంత్రి అనిత ఆదేశం

పరిమితికి మించి కెమెకల్స్‌ నిల్వచేయడంపై ఆగ్రహం

రాంబిల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని లాలంకోడూరు సమీపంలో ఎస్‌వీఎస్‌ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం నాన్‌ సెజ్‌లో లాలంకోడూరు సమీపంలో వున్న ఎస్‌వీఎస్‌ రసాయన పరిశ్రమలో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం మంత్రి అనితోపాటు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానం, కంపెనీకి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. పరిమితికి మించి కెమికల్స్‌ను నిల్వచేయడం ఏమిటంటూ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలైనా ఎండీ ఇక్కడికి ఎందుకు రాలేదంటూ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఎస్‌వీఎస్‌ రసాయన పరిశ్రమలో జరిగినట్టు తేలితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వుండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల కారణంగానే పరిశ్రమల్లో ప్రమాదాలు తగ్గుతున్నాయని ఆమె తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టిన పోలీసు, అగ్నిమాపక శాఖల అఽధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌, అడ్డరోడ్డు జంక్షన్‌ ఆర్డీఓ వీవీ రమణ, రాంబిల్లి, ఎలమంచిలి సీఐలు నరసింగరావు, ధనుంజయరావు, తహశీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డీజడ్‌ఎం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు..

Updated Date - Jan 05 , 2026 | 01:04 AM